India Vs Australia Border Gavaskar Trophy : పెర్త్ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భారత్ శుభారంభం చేసింది. 295 పరుగుల విజయంతో టీమ్ఇండియా మొదటి టెస్టును కైవసం చేసుకుంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంతో ముందంజలో ఉంది. ఇక భారత్ నిర్దేశించిన 534 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 238 పరుగులకే కుప్పకూలింది. అయితే ఈ వేదికగా ఆస్ట్రేలియాకు ఇదే తొలి ఓటమి. ఇంతకుముందు ఇక్కడ ఆడిన అన్ని టెస్టుల్లోనూ ఆసిస్ విజయం సాధించింది. ఈ క్రమంలో భారత్ పలు రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది. అదేంటంటే?
47 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో భారత్ అతిపెద్ద విజయం (పరుగుల పరంగా)
ఆస్ట్రేలియా వేదికగా భారత్ నమోదు చేసిన ఈ భారీ స్కోర్ వద్ద టీమ్ఇండియా ఓ రేర్ రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. సరిగ్గా 47 ఏళ్ల తర్వాత ఆతిథ్య జట్టుపై వాళ్ల సొంత గడ్డలో ఇలా అత్యథిక రన్స్‌తో ఓడించింది. 1977 డిసెంబర్ 30న మెల్బోర్న్‌లో ఆస్ట్రేలియాను 222 పరుగుల తేడాతో ఓడించిన భారత్, ఆ తర్వాత 2018 డిసెంబర్ 26న మెల్‌బోర్న్‌లోనే మరో పెద్ద విజయం సాధించింది. అప్పుడు భారత్ 137 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ సారి మాత్రం అంతకుమించి రన్స్‌తో చెలరేగిపోయింది. ఇక భారత్ ఇప్పటి వరకూ ఆసీస్‌పై అత్యథిక పరుగులు ఎప్పుడు నమోదు చేసిందంటే :
- ఆప్టస్, పెర్త్ - 295 పరుగులు - 2024 నవంబర్ 25
- మెల్బోర్న్ - 222 పరుగులు - 1977 డిసెంబర్ 30
- మెల్‌బోర్న్ - 137 పరుగులు - 2018 డిసెంబర్ 26
- WACA, పెర్త్ - 72 పరుగులు - 2008 జనవరి 16
- మెల్బోర్న్ - 59 పరుగులు - 1981 ఫిబ్రవరి 7