Ind vs Zim T20 2024 Yashasvi Jaiswal: జింబాబ్వే పర్యటలో భాగంగా జరిగిన నాలుగో టీ20లో టీమ్ఇండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత జట్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (93) అదరగొట్టి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
ముందు నుంచే దూకుడుగా ఆడిన జైస్వాల్ శతకం చేస్తాడని అందురూ అనుకున్నారు. కానీ ఆ ఫీట్‌ను అందుకోలేకపోయాడు. దీంతో శుభ్‌మన్ గిల్ వల్లే జైస్వాల్ సెంచరీ చేయలేకపోయాడంటూ గిల్‌పై కొంతమంది నెటిజన్లు విమర్శలు గుప్పించారు.గిల్ దూకుడుగా ఆడి, జైస్వాల్‌కు అడ్డుపడ్డాడని అంటున్నారు. అయితే, మ్యాచ్ తర్వాత జైస్వాల్ కొంతమంది అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా సెంచరీ మిస్ కావడం గురించి వారు అడిగిన ప్రశ్నలకు ఈ విధంగా సమాధానమిచ్చాడు.
'గిల్ మ్యాచ్‌ను త్వరగా పూర్తి చేయడం గురించి మాత్రమే మేము ఆలోచించాం. ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా విజయం సాధించాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగాం. ఆ రోజు నా ఆటను ఆస్వాదించా. శుభ్‌మన్ గిల్‌తో కలిసి బ్యాటింగ్ చేయడం అద్భుతమైన అనుభూతినిచ్చింది. మంచి స్కోరు సాధించినందుకు ఆనందంగా ఉంది. భారత్ కోసం ఆడటాన్ని గర్విస్తా' అని యశస్వి జైస్వాల్ పేర్కొన్నాడు.