Gajkesari Yogam Zodiac Signs : సాధారణంగా గ్రహాలు ఒక రాశి నుంచి ఇంకో రాశికి ప్రయాణిస్తుంటాయి. అయితే ఈ గ్రహ సంచారం ద్వాదశ రాశులపై ప్రభావం చూపిస్తుంది. త్వరలో చంద్రుడు తన గమనాన్ని మార్చుకోనుండంతో ఈ ప్రభావం ఏయే రాశులపై ఉంటుందో ఈ కథనంలో తెలుసుకుందాం.
కొత్త ఏడాదిలో మెుదటి గజకేసరి రాజయోగం
కొత్త ఆశలతో మొదలైన కొత్త సంవత్సరంలో జనవరి 9న మెుదటి గజకేసరి రాజయోగం ఏర్పడనుంది. ఈ సందర్భంగా అసలు గజకేసరి రాజయోగం అంటే ఏమిటి? ఈ యోగం వలన ఏయే రాశులకు శుభఫలితాలు రానున్నాయి?
గజకేసరి రాజయోగం అంటే?
చంద్రుడు గురువుతో కలిసినప్పుడు ఏర్పడే యోగాన్ని 'గజకేసరి రాజయోగం' అంటారు. ఈ రాజయోగం చాలా శక్తివంతమైనది. ఈ రాజయోగం జనవరి 09, 2025న జరుగనుంది. ఎందుకంటే ఈ రోజున చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే ఈ రాశిలో గురువు సంచరిస్తున్నందున ఈ రెండు గ్రహాల కలయిక వల్ల గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. 2025లో ఏర్పడనున్న తొలి గజకేసరి రాజయోగం ఇదే! దీనితో కొన్ని రాశుల వారికి గజకేసరి రాజయోగంతో బాగా కలిసి రానుంది. ఆ రాశులేమిటి చూద్దాం!
వృషభ రాశి
వృషభ రాశిలో గజకేసరి రాజయోగం మొదటి ఇంట్లో ఏర్పడనుంది. గజకేసరి రాజయోగంతో వృషభ రాశి వారికి అన్ని విధాలా కలిసి వస్తుంది. ఈ రాశి వారు అన్ని రంగాలలో మంచి విజయాన్ని చూస్తారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. లక్ష్మీ దేవి ఆశీస్సులతో అదృష్టం కలిసివచ్చి విశేషమైన సంపదలు చేకూరుతాయి. ఈ సమయంలో వీరు ఇంత కాలం ఎదుర్కొన్న అన్ని సమస్యలకు ముగింపు పలుకుతారు. ప్రతి రంగంలో విజయం దొరుకుతుంది. ఉద్యోగస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. పదోన్నతులు, ఆర్ధిక ప్రయోజనాలు మెండుగా ఉంటాయి. ఈ సమయంలో వీరు డబ్బు బాగా ఆదా చేస్తారు. స్థిరాస్తులు, భూములు కొనుగోలు చేస్తారు. పదవీయోగం ఉంది. శ్రీలక్ష్మీ గణపతి ఆరాధన చేయడం శుభప్రదం.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశిలో 6వ ఇంట గజకేసరి రాజయోగం ఏర్పడనుంది. ఈ యోగంతో ఈ రాశివారికి ఆర్ధికంగా విశేషంగా కలిసి వస్తుంది. వారసత్వపు ఆస్తుల నుంచి మంచి లాభాలను పొందుతారు. పని మీద పూర్తి శ్రద్ధ పెట్టి వృత్తిలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వ్యాపారులు విపరీతమైన లాభాలను ఆర్జిస్తారు. కొత్త ప్రాజెక్టుల నుంచి మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగస్తులకు స్థానచలనం సూచన ఉంది. విదేశాలలో పనిచేసే అవకాశాలు లభిస్తాయి. సామాజికంగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అష్టలక్ష్మి స్తోత్రం పఠించడం శుభకరం.
కుంభ రాశి
కుంభ రాశిలో 4వ ఇంట గజకేసరి రాజయోగం ఏర్పడనుంది. ఈ యోగంతో ఈ రాశివారికి గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అదృష్టం వరించి ఐశ్వర్యవంతులు అవుతారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగస్తులకు మంచి పదోన్నతులు రావడంతో నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యాపారులు విశేషమైన లాభాలు గడిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనం పెరుగుతుంది. వృత్తి పరంగా మంచి అవకాశాలు రానున్నాయి. శుభవార్తలు వింటారు. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కనకధారా స్తోత్రం పారాయణం చేయడం శుభప్రదం. గ్రహాల గమనంతో జరిగే మార్పులను అర్ధం చేసుకొంటూ తగిన పరిహారాలు పాటిస్తూ స్వధర్మాన్ని విడిచి పెట్టకుండా ఉంటే సకల శుభాలు చేకూరుతాయి. శుభం భూయాత్!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.