Manikya Ranganath Swamy Temple Telangana History : ధనుర్మాసం సందర్భంగా దక్షిణాదిన ఉన్న అన్ని శ్రీరంగనాథుని ఆలయాలలో విశేష పూజలు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణాలో వెలసిన ప్రసిద్ధి చెందిన మాణిక్య వీణ రంగనాథ స్వామి దేవాలయం క్షేత్ర విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
మాణిక్య వీణ రంగనాథ స్వామి దేవాలయం ఎక్కడుంది?
తెలంగాణలోని మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం ఎదులబాద్ గ్రామంలో శ్రీ గోదా సమేత రంగనాథ స్వామి దేవాలయం వెలసి ఉంది. సుమారు 500 సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయం ఘటకేసర మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది.
గోదాదేవి ప్రణయ భక్తి
పన్నెండు మంది ఆళ్వారులలో ఒకే స్త్రీ మూర్తి గోదాదేవి. విష్ణుచిత్తునికి తులసి వనంలో దొరికిన గోదాదేవి ఆండాళ్ గా పెరిగి రంగనాయకుడే తన భర్తగా భావించి ఆయన కోసం సిద్ధం చేసిన మాలలను ముందు తానే ధరించేది. ఇదేమిటని కలవరపడిన విష్ణుచిత్తునికి రంగనాయకుడు కలలో కనిపించి ఆమె ధరించిన మాలలు తనకు ఇష్టమని అవే తనకు అలంకరించామని చెబుతాడు. ఆ విధంగా గోదాదేవి తన ప్రణయ భక్తితో రంగనాయకుని మనసు గెలుచుకుంది.
ఆలయ విశేషాలు
వైష్ణవ సంప్రదాయం ప్రకారం పూజా కార్యక్రమాలు జరిగే ఈ ఆలయం అద్భుతమైన కట్టడాలు, చక్కని శిల్పకళతో ఎంతో రమణీయంగా ఉంటుంది. అందమైన రాజగోపురం పైన చెక్కిన రకరకాల శిల్పాలు భక్తులను ఆకర్షిస్తాయి. భక్తులు ముందుగా ఆలయ ప్రాంగణంలో ఉన్న పుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారి దర్శనం చేసుకుంటారు.
అప్పన దేశికాచారికి స్వప్న సాక్షాత్కారం
ఎదులబాద్ను పూర్వం రాయపురం అని పిలిచేవారట. అప్పన దేశికాచారి అనే విష్ణుభక్తుడు, బ్రాహ్మణోత్తముడు ఈ క్షేత్రంలో నివసిస్తూ ఉండేవాడు. ఓ మునీశ్వరుని మంత్రోపదేశంతో అప్పన దేశికాచారి మధురై సమీపంలో ఉన్న శ్రీ విల్లిపుత్తూరులో ఆండాళ్ అమ్మవారిని దర్శించుకున్నాడు. అక్కడ ఆయనకు స్వప్నంలో గోదాదేవి అమ్మవారు కలలో దర్శనమిచ్చి తనను రాయపురం తీసుకొని వెళ్లమని చెప్పిందట. అక్కడ విగ్రహ రూపంలో దొరికిన అమ్మవారిని తీసుకొని వచ్చి గ్రామస్తుల సహాయంతో ఈ దేవాలయాన్ని నిర్మించారని స్థల పురాణం. ఇప్పటికీ ఈ దేవాలయంలో ఆ వంశస్తులే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
గరుడాద్రి
ఒకప్పుడు ఆ ప్రాంతమంతా చెట్టు గుట్టలతో నిండి ఉండేది. ఈ ప్రాంతంలో గరుడ పక్షులు సంచారం కూడా ఉండేదట అందువలన దీనిని గరుడాద్రి అని కూడా పిలుస్తారు.
గాజుల ఆండాళమ్మ - గాజుల గోదాదేవి
ఒక్కసారి ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్న సమయంలో గోదాదేవి అమ్మవారు ఒక గాజుల దుకాణానికి వెళ్లి గాజులు వేయించుకొని డబ్బులు మా నాన్నగారు ఇస్తారు అని చెప్పి వెళ్ళిపోయిందట. దుకాణం యజమాని ఆలయ అధికారిని అడగగా తనకు కూతుర్లు ఎవరూ లేరని అన్నాడంట! ఆ తరువాత ఆలయంలోకి వెళ్లి చూడగా ఆ గాజులు అమ్మవారి చేతికి ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. ఆనాటి నుంచి గ్రామస్తులు అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచు గా భావించి ఒడి బియ్యం పోస్తూ ఉండడం ఇక్కడి ఆచారం. అందుకే అప్పటినుంచి ఈ అమ్మవారిని గాజుల గోదాదేవి అని, గాజుల ఆండాళమ్మ అని కూడా పిలుస్తారు.
స్వప్నంలో దిశా నిర్దేశం
ఇక్కడ వెలసిన గోదాదేవి భక్తుల పాలిట కల్పవల్లి. ఈ తల్లి భక్తులకు స్వప్నంలో సాక్షాత్కరించి దిశా నిర్దేశం చేస్తుందని విశ్వాసం. అలాగే ఈ ఆలయంలో గోదాదేవిని దర్శించి కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేరుస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఉత్సవాలు వేడుకలు
శ్రావణ మాసంలో గోదాదేవి జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ వేడుకగా ఉత్సవాలు జరుగుతాయి. అలాగే ధనుర్మాసంలో తిరుప్పావై, భోగి పండుగ రోజు గోదాదేవి కళ్యాణం ఘనంగా జరుగుతాయి. ధనుర్మాసం సందర్భంగా ఎంతో మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ఒడిబియ్యం పోస్తూ ఉండడం ఇక్కడి ఆచారం. ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ దర్శించాల్సిన ఈ క్షేత్రాన్ని మనం కూడా దర్శిద్దాం. తరిద్దాం
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.