Youtuber In Distress After Haircut : అతడొక యూట్యూబర్. వయసు 26 ఏళ్లు. కాలేజీ విద్యార్థులపైకి కారును నడిపేందుకు యత్నించాడని పోలీసులు మహ్మద్ షాహీన్ షా అనే యువకుడిపై హత్యాయత్నం కేసును నమోదు చేశారు. జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా కేరళలోని త్రిస్సూర్ జిల్లా జైలుకు తరలించారు. ఇక్కడే అసలు కథ మొదలైంది.
విచారణ ఖైదీలకు కూడా జైలు నియమావళి ప్రకారం హెయిర్ కట్ చేయిస్తుంటారు. ఈ క్రమంలోనే మహ్మద్ షాహీన్ షాకు కూడా హెయిర్ కట్ చేశారు. దీంతో ఖైదీలా తనకు హెయిర్ కట్ చేయించారంటూ అతగాడు మానసిక కుంగుబాటుకు లోనయ్యాడు. దీంతో పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం త్రిస్సూర్‌లో ఉన్న మానసిక వైద్యశాలలో చేర్పించారు. ప్రస్తుతం మహ్మద్ షాహీన్ షా వైద్యుల పరిశీలనలో ఉన్నాడు. ఇతడు త్రిసూర్ జిల్లాలోని ఎరనెల్లూర్ ప్రాంతవాసి. 'మనవలన్' (వరుడు) పేరుతో మలయాళం భాషలో ఒక యూట్యూబ్ ఛానల్‌ను నడుపుతున్నాడు.
2024 సంవత్సరం ఏప్రిల్ నెల మూడో వారంలో స్థానికంగా ఓ కాలేజీ వద్ద జరిగిన ఘర్షణలో మహ్మద్ షాహీన్ షా కూడా ఉన్నాడు. అక్కడున్న కాలేజీ విద్యార్థులపైకి కారును నడిపేందుకు యత్నించాడు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు షాహీన్ షాపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. 2024 ఏప్రిల్ 19 నుంచి షాహీన్ షా పరారీలోనే ఉన్నాడు. పోలీసులు దర్యాప్తు చేయగా అతడు కర్ణాటకలోని కొడగులో దాక్కున్నట్లు తేలింది. త్రిస్సూర్ పోలీసులు జనవరి 21న(మంగళవారం) కొడగుకు వెళ్లి అతడిని అరెస్టు చేశారు. త్రిస్సూర్ జిల్లా కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో షాహీన్ షాను త్రిస్సూర్ జిల్లా జైలుకు తరలించారు. మరోవైపు ఈ కేసుపై షాహీన్ షాకు చెందిన 'మనవలన్' యూట్యూబ్ ఛానల్‌లో ఎప్పటికప్పుడు అతడి మిత్రులు అప్‌డేట్స్ పోస్ట్ చేస్తున్నారు.