Ind vs Eng 4th Test 2024:రాంచీ టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. రెండో ఆట ముగిసేసరికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 219-7తో నిలిచింది. భారత్ ఇంకా 134 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజులో ధ్రువ్ జురెల్ (30 పరుగులు), కుల్దీప్ యాదవ్ (17 పరుగులు) ఉన్నారు. టీమ్ఇండియాలో యశస్వి జైశ్వాల్ (73 పరుగులు; 117 బంతులు; 8x4, 1x6) ఒక్కడే హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 4, టామ్ హార్ట్లీ 2, జేమ్స్ అండర్సన్ 1 వికెట్ దక్కించుకున్నారు.
తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా భారీ స్కోర్ చేయడంలో విఫలమైంది. కెప్టెన్ రోహిత్ శర్మ (2)ను అండర్సన్ పెవిలియన్ చేర్చాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో నాలుగో బంతిని డిఫెన్స్ చేసే క్రమంలో రోహిత్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరాల్సి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన శుభ్‌మన్ గిల్ (38)తో జైశ్వాల్ మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న సమయంలో స్పిన్నర్ బషీర్, గిల్‌ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు.
సిరీస్‌లో మరో ఛాన్స్ దక్కించుకున్న రజత్ పటీదార్ (17) ఈఇన్నింగ్స్లోనూ నిరాశపర్చాడు. మరోసారి స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. అనంతరం వచ్చిన జడేజా (12) రెండు సిక్స్‌లు బాది ఊపుమీద కనిపించాడు. కానీ,అతడిని కూడా బషీర్ బోల్తా కొట్టించాడు. సర్ఫరాజ్ (14) ఈ మ్యాచ్‌లో సత్తా చాటలేకపోయాడు. అశ్విన్ (1) హార్ట్లీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇక జురెల్, కుల్దీప్తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపిస్తున్నాడు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఈ జోడి ఇప్పటికే 42 పరుగులు జోడించింది.