Ind vs Eng 2nd T20 2025: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్- ఇంగ్లాండ్ జట్లు శనివారం చెన్నై వేదికగా రెండో మ్యాచ్‌లో తలపడనున్నాయి. శనివారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభంకానుంది. తొలి టీ20లో జయభేరి మోగించిన టీమ్ఇండియా ఈ పోరులో కూడా ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాలని కోరుకుంటోంది. తొలి మ్యాచ్‌లో ప్రత్యర్థి ఇంగ్లాండ్‌పై అన్ని విభాగాల్లోనూ భారత జట్టు ఆధిపత్యం ప్రదర్శించింది. రెండో టీ20లోనూ అదే జోరు కొనసాగించాలని టీమ్ఇండియా భావిస్తోంది.
ఈసారైనా?
కోల్‌కోతాలో పేసర్ అర్ష్‌దీప్ సింగ్, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సత్తా చాటి ఇంగ్లాండ్‌ను తక్కువ పరుగులకే పరిమితం చేశారు. అయితే సుదీర్ఘ విరామం తర్వాత టీ20లకు ఎంపికైన పేసర్ మహ్మద్ షమీ తొలిమ్యాచ్‌లో ఆడలేదు. దాదాపు 14 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టేందుకు సిద్ధమైన సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి ఈ మ్యాచ్‌లోనైనా తుదిజట్టులో చోటు దక్కుతుందో లేదో వేచి చూడాలి.
చెపాక్ పిచ్ స్పిన్నర్లదే!
చెన్నై పిచ్ స్పిన్నర్లకు మరింత సహకరిస్తుందని భావిస్తున్నారు. వరుణ్, అక్షర్ పటేల్, రవిబిష్ణోయ్‌తో భారత స్పిన్ విభాగం పటిష్ఠంగా కనిపిస్తోంది. అనుభవజ్ఞులైన స్పిన్నర్లు ఆదిల్ రషీద్, లివింగ్ స్టోన్ భారత బ్యాటర్లను కట్టడి చేయాలని ఇంగ్లాండ్ జట్టు కోరుకుంటోంది.