Ind vs Eng 1st Test:భారత్- ఇంగ్లాండ్ తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా 421/7 (110 ఓవర్ల)తో నిలిచి, 175 పరుగల లీడ్‌లో కొనసాగుతోంది. రవీంద్ర జడేజా (81 పరుగులు), అక్షర్ పటేల్ (35 పరుగులు) క్రీజులో ఉన్నారు. కేఎల్ రాహుల్ (86 పరుగులు) హాఫ్ సెంచరీతో అదరగొట్టగా, శ్రీకర్ భరత్ (41 పరుగులు), శ్రేయస్ అయ్యర్ (35) రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో టామ్ హార్ట్లీ 2, జో రూట్ 2, జాక్ లీచ్, రెహన్ అహ్మద్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఓవర్‌నైట్ స్కోర్ 119-2తో గేమ్ ప్రారంభించిన టీమ్ఇండియా రెండో రోజు ఐదు వికెట్లు కోల్పోయి 302 పరుగులు జోడించింది. ఇక తొలి రోజు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 246 పరుగులకు ఆలౌటైంది.
ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోర్ 76తో రెండో రోజు ఆట ప్రారంభించిన జైశ్వాల్ తొలి ఓవర్ 4 బంతికే ఔటయ్యాడు. కాసేపటికే శుభ్‌మన్ గిల్ (23) కూడా పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్- రాహుల్ 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత అయ్యర్ క్యాచౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో రాహుల్ కెరీర్లో 14వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక సెంచరీ దిశగా సాగుతున్న రాహుల్‌ను టామ్ హార్ట్లీ వెనక్కిపంపాడు.