Parents Attention to Children Education : పిల్లల చదువులపై నేటి తల్లిదండ్రులు ఎంతో శ్రద్ధ చూపుతున్నారు. పదేళ్ల క్రితం చూస్తే ప్రాథమిక విద్యాభ్యాసం చేసేవారిపై దృష్టి ఎక్కువగా ఉండేది. సరిగా ఏకాగ్రత చూపరనో? చిన్నవారనో ఎక్కువ సమయం ఇచ్చేవారు. ఇప్పుడు ఈ పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉన్నత పాఠశాల (6-10తరగతి), ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చిన వారిపై తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు శ్రద్ధ చూపిస్తున్నారు.
పిల్లల చదువులపై శ్రద్ధ : ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదివేవారిని కళాశాలలకే వదిలేయడం లేదని తాజా విద్యాస్థితి నివేదిక 2024 చెపుతుంది. ఇంటర్ గరిష్ఠ మార్కులు, తదుపరి ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకే లక్ష్యంగా ఇంట్లో వాళ్లు బాగా ప్రోత్సహిస్తున్నారు. పిల్లలు పాఠశాలల వెళ్లొచ్చిన తర్వాత వారితో రెండు నుంచి మూడు గంటలు సమయం కేటాయిస్తున్నారు. వారికి పరీక్షలు దగ్గరపడిన కొద్దీ వారు వెనుకబడిన సబ్జెక్టులు ఏమిటో తెలుసుకొని కోచింగ్ ఇప్పిస్తున్నారు. వారికి కావాల్సిన పుస్తకాలు ఇతర అవసరాలను సమకూర్చుతున్నారు. కానీ సాధారణ రోజులు, ముఖ్యంగా పరీక్ష సమయాల్లో విద్యార్థులపై ఒత్తిడి కలిగేలా తల్లిదండ్రులు ప్రవర్తించవద్దని విద్యారంగా నిపుణులు తెలిపారు.
- వారి ఆందోళనలు వస్తే ధైర్యం చెప్పి ప్రశాంతవాతావరణంలో చదువుకునేలా చేయాలి. అప్పుడే అమ్మనాన్నలకు పిల్లలు మంచి మార్కులు వేస్తారని సూచిస్తున్నారు.
- సబ్జెక్టుల వారీగా ఏది ఎప్పుడు చదవాలో, విరామానికి సంబంధించి పిల్లలతో కలసి టైం టేబుల్ తయారుచేయాలి.
- కావాల్సిన పుస్తకాలు, మెటీరియల్, ఇతర సామాగ్రిని సేకరించేందుకు సహాయపడండి.
- ముఖ్యాంశాలు రాయడం, ఇతరులతో చర్చించుకునే చిట్కాలు వీలైనన్ని నేర్చుకునేలా ప్రోత్సహించాలి.
- చదువు, ఆరోగ్యపరంగా ఏ సమస్యులున్నా ఇంట్లో వారితో చెప్పుకునేలా స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించాలి.
- అలసట దరిచేరకుండా, ఆరోగ్యాన్ని కాపాడుకునేలా తగినంత నిద్రపోనివ్వండి. వ్యాయామం చేసేలా ప్రోత్సహించండి.
- పరీక్షల్లో చూపిన ప్రతిభను గుర్తించి అభినందించండి. ఇతరుల మార్కులతో పోల్చకండి.
- చిన్న విజయాలను సెలబ్రేట్ చేయండి. చదువులో మరింత మెరుగయ్యేలా ప్రోత్సహించండి.
- ర్యాంకులు, మార్కులే లక్ష్యం కాకుండా అకడమిక్‌పరంగా ప్రతిభచూపడం ముఖ్యమనే ఆలోచన కలిగించండి.
"పరీక్షలు పిల్లల జీవితంలో ఓ భాగమే. పరీక్షలే వారి జీవితమనేలా తల్లిదండ్రులు వ్యవహరించొద్దు. ఇతరులు బాగా చదువుతున్నారనో, ఫీజులు రూ.లక్షలు చెల్లించామనో మందలించొద్దు. స్మార్ట్‌ఫోన్లు, టీవీలకు దూరంగా ఉంచాలి. విశ్రాంతి కోసం తోటి విద్యార్థులతో ఆడుకునేలా, వ్యాయామం చేసేలా చూడాలి."-నాగరాజశేఖర్, అకడమిక్ మానిటరింగ్ అధికారి