Father Saves Son From Drowning : ఆయనో రైతు. 75 ఏళ్ల వయసులోనూ కుమారుడికి చేదోడుగా ఉంటూ వ్యవసాయ పనులు చేస్తున్నాడు. రోజు మాదిరిగానే వారి పనుల్లో భాగంగా పంటలకు నీరు పెట్టేందుకు తండ్రీకుమారులు పొలానికి వెళ్లారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కూడవెళ్లి వాగులో నుంచి మోటారు ద్వారా నీటిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కుమారుడు అందులో పడిపోయాడు. అక్కడే ఉన్న తండ్రి ప్రాణాలకు తెగించి నీళ్లలో కొట్టుకుపోతున్న తనయుడిని రక్షించారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం చిట్టాపూర్‌లో చోటుచేసుకుంది.
తల్లడిల్లిన తండ్రి ప్రాణం : 108 సిబ్బంది నరసింహులు, శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం, చిట్టాపూర్‌కు చెందిన రైతు కురుమగుల్ల మల్లయ్యకు కూడవల్లి వాగు సమీపంలో వ్యవసాయ పొలం ఉంది. మూడో రోజుల క్రితం కూడవల్లి వాగుకు విడుదలైన నీరు చిత్తాపూర్ శివారులోకి చేరుకుంది. మల్లయ్య అతని తండ్రి నారాయణ సహాయంతో వాగులో పైపులు వేసి మోటారు ద్వారా నీటిని పొలానికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కుమారుడు వాగులో పడి కొట్టుకుపోతుండగా, వెంటనే తండ్రి వాగులోకి దూకి కుమారుడిని బయటకు తీసుకొచ్చాడు.
ఈ క్రమంలోనే మల్లయ్య అపస్మారక స్థితిలోకి చేరుకోగా, కుటుంబసభ్యులు వెంటనే 108కు కాల్ చేశారు. వారు రాగానే పొలం నుంచి దాదాపు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రధాన రహదారి మీదకు స్ట్రక్చర్‌పై మోసుకొచ్చారు. సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం మల్లయ్య ఆరోగ్యం కుదుటపడిందని వైద్యులు తెలిపారు.