Ratha Saptami 2025 Puja Vidhi : ప్రతి సంవత్సరం మాఘ మాసం శుక్ల పక్షంలో వచ్చే సప్తమి తిథిని "రథ సప్తమి"గా వ్యవహారిస్తారు. ముఖ్యంగా ఈ పర్వదినాన సూర్యుడు ఏడు గుర్రాలపై దక్షిణాయనం నుంచి ఉత్తరాయనం వైపు ప్రయాణం సాగిస్తాడు. అందుకే మాఘ సప్తమి మొదలు వచ్చే ఆరు మాసాలూ ఉత్తరాయణ పుణ్యకాలమని చెబుతారు పండితులు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రథసప్తమి ఎప్పుడొచ్చింది? దాని ప్రాముఖ్యత ఏంటి? ఈ రోజున ఎలా స్నానం చేస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయి? సూర్యభగవానుడిని ఎలా పూజించాలి? వంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
హిందూ పురాణాల ప్రకారం, కశ్యప మహర్షి, అదితి దేవి దంపతులకు సూర్య భగవానుడు జన్మించాడు. ఆయన పుట్టినరోజునే "రథ సప్తమి"గా జరుపుకుంటారు. దీన్నే సూర్య జయంతి, అచల సప్తమి, విధాన సప్తమి అనే పేర్లతోనూ పిలుస్తారు. అయితే, హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం(2025) ఫిబ్రవరి 4వ తేదీన(మంగళవారం) రథ సప్తమి వచ్చింది. ముఖ్యంగా ఈ రోజు చేసే స్నానానికి చాలా ప్రాధాన్యత ఉందంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్.
రథ సప్తమి రోజు స్నానం ఎలా చేయాలంటే?
ఎంతో పవిత్రమైన పర్వదినంగా భావించే రథ సప్తమి నాడు చేసే ప్రత్యేకమైన స్నానం ఏడు జన్మల పాపాలు, దోషాలు, దరిద్రాలను తొలగింపజేస్తుందంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్. మరి, ఈ పవిత్రమైన స్నానం కోసం ఏడు జిల్లేడు ఆకులు, 7 రేగి పళ్లు తీసుకోవాలి. ఆపై స్నానం చేసే ముందు వాటిని శిరస్సుపై ఉంచి తలస్నానం చేయాలంటున్నారు. ఎందుకంటే ఇవి సూర్యభగవానుడికి చాలా ఇష్టం. కాబట్టి, రథ సప్తమి రోజు చేసే ఈ ప్రత్యేక స్నానం ఏడు రకాలైన పాపాలను తొలగిస్తుందట.
సూర్యుడికి ఇలా నమస్కరించండి - అద్భుత ప్రయోజనాలు మీ సొంతం!
సూర్యుడిని ఎలా పూజించాలంటే?
- తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని పైన చెప్పిన విధంగా తలస్నానం చేయాలి.
- స్నానమాచరించాక సూర్యుడిని ఆరాధించాలి. ఇందుకోసం మీ ఇంటి ఆవరణలో సూర్య కిరణాలు ఎక్కడ స్పష్టంగా పడతాయో అక్కడ ముగ్గులు వేసుకోవాలి.
- ఆ తర్వాత మీకు వీలైతే చిక్కుడు ఆకులు, చిక్కుడు పూలు, చిక్కుడు కాయలు వీటిని కలిపి ఒక మండపం లాగా పెట్టాలి. అక్కడ సూర్య దేవుని ఫొటో లేదా విగ్రహాన్ని ఉంచాలి.
- ఆపై ఆ చిత్రపటాన్ని గంధం, కుంకుమ పెట్టి, ఎర్రని రంగు పువ్వులతో అలంకరించాలి.
- ఇవన్నీ కుదరకపోతే మీ పూజ మందిరంలో ఒక తమలపాకు తీసుకుని దానిపై తడి గంధంతో గుండ్రంగా ఒక రూపు గీయండి. దానిని సూర్యభగవానుడిగా భావించాలి. ఒకవేళ మీ దగ్గర సూర్య దేవుని ఫొటో ఉంటే పెట్టండి.
- అనంతరం గోధుమలతో తయారు చేసిన పదార్థం నైవేద్యంగా పెట్టి సూర్య భగవానుడిని పూజించాలి.
- మీకు వీలైతే ఆవు పాలతో పాయసం చేసి సమర్పిస్తే ఇంకా మంచిది. అలాగే, కొబ్బరి పుల్లల సహాయంతో చిన్న రథాన్ని తయారు చేసి, ఆ రథానికి పూజ చేసి, ఆవు నెయ్యితో చేసిన దీపం వెలిగించాలి.
- పూజ కార్యక్రమాలు ముగిసిన అనంతరం కుటుంబ సభ్యులు ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి.
దానం ఇవ్వాల్సినవి!
సూర్యుడికి ఇష్టమైన రథ సప్తమి రోజున ఎవరికైనా ఒకరికి గొడుగు, చెప్పులు దానం ఇవ్వడం వల్ల జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయంటున్నారు మాచిరాజు కిరణ్.
రథ సప్తమి రోజు ఇలా సూర్యభగవానుని ప్రత్యేకమైన విధివిధానాలతో ఆరాధించడం, దాన ధర్మాలు చేయడం వల్ల ద్వారా సూర్యదేవుడు భక్తులకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయువును ప్రసాదిస్తాడని, ఆదాయ పరంగా మంచి ప్రయోజనాలు చేకూరతాయంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్. అలాగే, సూర్యుడి సంపూర్ణ అనుగ్రహం లభించి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయంటున్నారు.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
సూర్యుని ఆరాధించే 'రథసప్తమి'- ఈ దానాలు చేస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలు మీ సొంతం!