Teamindia VS Bangladesh Test Series : టీమ్ ఇండియా మళ్లీ టెస్ట్ సమరానికి సిద్ధమవుతోంది. చివరిగా ఈ ఏడాది మార్చిలో టెస్టు మ్యాచ్ ఆడింది. మళ్లీ ఆ తర్వాత ప్లేయర్స్ రెండు నెలల పాటు ఐపీఎల్‌తో బిజీ అయిపోయారు. అనంతరం టీ20 వరల్డ్ కప్ ఆడారు. ఆపై శ్రీలంకలో టీ20, వన్డే సిరీస్‌ల్లో ఆడారు.
అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఆర్నెళ్ల తర్వాత మళ్లీ ఎర్ర బంతితో మ్యాచ్ ఆడేందుకు సన్నద్ధమవుతున్నారు. శ్రీలంక పర్యటన అనంతరం నెల రోజుల తర్వాత బ్యాట్ పట్టనున్నారు. ముందుగా ఈ నెల 19 నుంచి బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడనున్నారు. ఆ తర్వాత కూడా స్వదేశంలోనే న్యూజిలాండ్‌తో మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్ ఆడతారు. అనంతరం ప్రతిష్టాత్మక బోర్డర్-గావస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లి తలపడతారు.
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ సిరీస్ ముంగిట టీమ్ ఇండియా తమ ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేసింది. చెన్నైలో వచ్చే గురువారం నుంచి మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జట్టులోని ప్రధాన ప్లేయర్స్ చెన్నైకి చేరుకుని సాధన కూడా చేస్తున్నారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ లండన్ నుంచి చెన్నైకి చేరుకోగా, రోహిత్ ముంబయి నుంచి చెన్నైకు చేరుకున్నారు.
కోహ్లీ అయితే 45 నిమిషాల పాటు నెట్స్‌లో చెమటోడ్చాడు. బ్రేక్ లేకుండా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఫాస్ట్ బౌలర్ బుమ్రా కూడావేగంతో బంతులు సంధిస్తూ ప్రాక్టీస్ చేశాడు. ఇక మిగతా ప్లేయర్స్‌లో కొంతమంది ప్రాక్టీస్‌కు హాజరు అవ్వగా, మరి కొందరు హోటల్ రూమ్‌కే పరిమితమయ్యారు.