Yograj On Gautam Gambhir : ఆసీస్‌తో జరిగిన బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో టీమ్ ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. పదేళ్ల తర్వాత ఆసీస్ 3-1 తేడాతో సిరీస్‌ను చేజిక్కుంచుకుంది. ఈ సిరీస్‌లో భారత బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ నిలకడలేని ఆటతీరుతో విఫలమయ్యారు. గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టెస్టు సిరీస్‌ను కోల్పోవడమే కాకుండా, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్ చేరుకోలేకపోయింది.
గంభీర్‌కు మద్దతుగా యోగ్రాజ్ సింగ్
ఈ క్రమంలో గౌతమ్ గంభీర్ కోచింగ్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే మాజీ క్రికెటర్ యోగ్రాజ్ సింగ్ మాత్రం గంభీర్‌కు మద్దతు ఇచ్చాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడేవారికి ప్రత్యేకంగా ఎవరూ చెప్పక్కర్లేదని, జట్టు అవసరాలకు తగ్గట్టుగా ఆడాలని పేర్కొన్నాడు. అలాగే విరాట్ కోహ్లీ వంటి స్టార్ బ్యాటర్ తన బలహీనతతో ఎనిమిదిసార్లు పెవిలియన్‌కు చేరడంపైనా యోగ్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
వారికి గంభీర్ సూచనలివ్వాలి : యోగ్రాజ్
"ఏ ప్లేయర్ అయినా టీమ్ఇండియాకు ఆడేటప్పుడు కోచ్ పాత్ర ఏంటనే ప్రశ్న వస్తుంది. అద్భుతమైన ఆటగాడిగా దేశానికి ఆడేటప్పుడు ప్రత్యేకంగా కోచ్ చెప్పేదేమీ లేదు. అయితే, రన్స్ చేసేందుకు ఇబ్బందిపడుతున్నప్పుడు మాత్రం కోచ్‌గా సూచనలు కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. టీమ్ మేనేజ్‌మెంట్ అండగా ఉండాలి. వారు ఎంతపెద్ద ప్లేయర్ అనేది సమస్య కాదు. ఎవరైనా సరే గేమ్ తర్వాతే పర్సనల్ గా ఉండాలి. విరాట్‌నే తీసుకుంటే అతడు తన ఫేవరెట్ షాట్‌తోనే ఎక్కువసార్లు అవుట్ అయ్యాడు. ఆఫ్‌సైడ్ బంతులను వెంటాడి వికెట్‌ను సమర్పించుకున్నాడు. ఇలాంటి షాట్లు భారత్, ఇంగ్లండ్ మైదానాల్లో ఆడొచ్చు కానీ ఆసీస్ పిచ్‌ల్లో కుదరదు. ఎందుకంటే బాల్ అనూహ్యంగా బౌన్స్ అవుతుంది. అందుకే, విరాట్‌కు ఆఫ్ సైడ్ బంతులను ఆడొద్దని, వాటిని వదిలేయమని చెబితే బాగుండేది. స్ట్రైట్‌గా ఆడేందుకు ప్రయత్నించమని సూచించాల్సింది. "
-- యోగ్ రాజ్ సింగ్, మాజీ క్రికెటర్
'ఆ బాధ్యత కోచ్ దే'
కోచింగ్, మేనేజ్‌మెంట్ మధ్య కాస్త వ్యత్యాసం ఉంటుందని యోగ్రాజ్ వ్యాఖ్యానించాడు. ఆటగాడి టెక్నికల్ తప్పిదాలను గుర్తించాల్సిన బాధ్యత కోచ్‌దేనని చెప్పాడు. తప్పిదాలను చెప్పి ప్లేయర్లకు సూచనలు ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు. విరాట్, రోహిత్ వంటి స్టార్లకు ఎవరు చెబుతారు? ఎవరైనా వచ్చి తమకు చెప్పాలని వారు అనుకోవడం కూడా తప్పేనని అన్నాడు. ఆటగాళ్లు విఫలమైనప్పుడు తామంతా ఉన్నామని, తప్పకుండా మళ్లీ బాగా ఆడతావని మేనేజ్‌మెంట్ అటగాడికి మద్దతుగా నిలవాలని పేర్కొన్నాడు. ప్లేయర్లను ప్రోత్సహించాలని వెల్లడించాడు.
'గంబీర్‌కు ఆ సత్తా ఉంది'
గౌతమ్ గంభీర్ జట్టును ముందుండి నడిపించగల సత్తా ఉన్న కోచ్ అని యోగ్రాజ్ వ్యాఖ్యానించాడు. అలాగే అద్భుతమైన క్రికెటర్, సూపర్ బ్రెయిన్ ఉన్న వ్యక్తి అని కొనియాడాడు. "జట్టులో ఎక్కడ పొరపాటు జరిగిందో గంభీర్ గుర్తించాలి. ఆ తర్వాత దాన్ని సరిచేయాలి. కుర్రాళ్లను బాగా ఎంగేజ్ చేస్తున్నాడు గంభీర్. అలాగే విరాట్, రోహిత్‌ల పేలవ ఫామ్ నుంచి బయటపడేలా చేయాలి. సిరాజ్ వంటి పేసర్‌కు అండగా నిలవాలి. ఆటగాళ్లు ఒత్తిడిలో ఉన్నప్పుడు కోచ్, మేనేజ్‌మెంట్ వారికి మద్దతుగా ఉండాలి." అని యోగ్రాజ్ వ్యాఖ్యానించాడు.