IND VS BAN Second Test :రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌పై చెన్నైలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఘన విజయాన్ని సాధించిన భారత జట్టు రెండో టెస్టు కోసం సిద్ధమైంది. శుక్రవారం కాన్పూర్ వేదికగా ఈ మ్యాచ్ ఆరంభంకానుంది. ఈ టెస్టులో కూడా గెలుపొంది సొంతగడ్డపై రికార్డు స్థాయిలో వరుసగా 18వ టెస్టు సిరీస్ విజయం సాధించాలని టీమ్ ఇండియా భావిస్తోంది. చెన్నై టెస్టులో అశ్విన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టగా, శుభమన్ గిల్, రిషభ్‌పంత్ శతకాలతో సత్తా చాటారు. రవీంద్ర జడేజా కూడా రాణించాడు. అయితే సీనియర్ బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పెద్దగా స్కోర్ చేయకపోవడం భారత్ జట్టును కలవరపెడుతోంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ గత కొంతకాలంగా పేలవమైన ఫామ్‌తో సతమతమౌతున్నాడు. తిరిగి గాడిలో పడేందుకు కోహ్లీ నెట్స్‌లో ముమ్మరంగా సాధన చేశాడు. రెండో టెస్టులో కోహ్లీ, రోహిత్ సత్తా చాటాలని భారత జట్టు కోరుకుంటోంది.
ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి - రెండో టెస్టులో ముగ్గురు పేసర్లకు బదులు ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని భారత జట్టు భావిస్తోంది. పేసర్ ఆకాశ్ దీప్ స్థానంలో కులదీప్ యాదవ్ లేదా అక్షర్‌పటేల్‌లో ఒకరు తుదిజట్టులోకి వచ్చే అవకాశం ఉంది. గత కొన్ని నెలలుగా వివిధ ఫార్మాట్లలో కులదీప్ యాదవ్ నిలకడగా రాణిస్తున్నాడు. మరో వికెట్ తీస్తే టెస్టుల్లో రవీంద్ర జడేజా 300 వికెట్ల మైలురాయి చేరుకుంటాడు. ఈ మ్యాచ్‌లో ఆ ఘనత సాధిస్తే టెస్టుల్లో 300 వికెట్లు తీయడమే కాకుండా, 3 వేల పరుగులు వేగంగా పూర్తి చేసిన రెండో ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా ఖ్యాతినార్జిస్తాడు.
వర్షం పడొచ్చు - మరోవైపు తొలిటెస్టులో భారత పేసర్లను, స్పిన్నర్లను ఎదుర్కొవడంతో బంగ్లాదేశ్ బ్యాటర్లు తడబడ్డారు. తుది జట్టులో పలు మార్పులతో బంగ్లా జట్టు బరిలోకి దిగే అవకాశం ఉంది. వేలి గాయం కారణంగా షకీబ్ అల్ హసన్ ఆడుతాడా లేదా ఇంకా తేలలేదు. పేసర్ నహిద్ రాణా స్థానంలో స్పిన్నర్ తైజుల్ ఇస్లాం తుదిజట్టులోకి వచ్చే అవకాశం ఉంది. రెండో టెస్టు తొలిరోజు, మూడోరోజు వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు బంగ్లాదేశ్ చేతిలో ఒక్క టెస్టులోనూ భారత్ ఓడిపోలేదు. అదే ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని టీమ్ ఇండియా అనుకుంటోంది.
పిచ్ ఎలా ఉందంటే -చెన్నైలో స్టేడియంలో ఎర్రమట్టి పిచ్‌పై సీమర్లు, స్పిన్నర్లిద్దరికీ మంచి బౌన్స్ దక్కింది. కానీ కాన్పూర్‌లో నల్లమట్టి పిచ్‌పై బౌన్స్ తక్కువగా ఉంటుంది. మ్యాచ్ సాగే కొద్దీ పిచ్ మరింత మందకొడిగా మారుతూ పోతుంది. వర్షం పడితే పిచ్‌లో మార్పు ఉంటుంది. మ్యాచ్ వేదిక అయిన గ్రీన్ పార్క్‌లో జరిగిన చివరి టెస్టు (2021, న్యూజిలాండ్‌తో)లో భారత్ ముగ్గురు (అశ్విన్, జడేజా, అక్షర్) స్పిన్నర్లతో ఆడింది. అయిదు రోజుల పాటు సాగిన ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అంతకుముందు 2016లో జరిగిన టెస్టు కూడా అయిదు రోజుల పాటు సాగింది. అది కూడా న్యూజిలాండ్‌తోనే.
కోహ్లీ 9 వేల పరుగులు- టెస్టుల్లో 9 వేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి విరాట్ కోహ్లి 129 పరుగులు చేయాలి.