Angelina Jolie Brad Pitt Divorce : ప్రముఖ హాలీవుడ్ నటులు ఏంజెలీనా జోలి - బ్రాడ్ పిట్ విడాకుల వ్యవహరం 8 ఏళ్ల తర్వాత ఓ కొలిక్కి వచ్చింది. ఏంజెలీనా జోలి, ఆమె భర్త బ్రాడ్ పిట్ విడాకుల సమస్యకు ఓ పరిష్కారం దొరికిందని జోలి తరఫు న్యాయవాది జేమ్స్ సైమన్ తెలిపారు. హాలీవుడ్ చరిత్రలో సుదీర్ఘమైన, అత్యంత వివాదాస్పదమైన విడాకులలో ఒకదానికి స్పష్టమైన ముగింపు పలికినట్లు ఆయన పేర్కొన్నారు.
8 ఏళ్ల క్రితమే విడాకులకు దరఖాస్తు
"8ఏళ్ల క్రితం బ్రాడ్ పిట్ నుంచి ఏంజెలీనా జోలీ విడాకుల కోసం కోర్ట్లో అపీల్ చేశారు. అప్పుడు ఆమె ఆస్తి కోసం ఆలోచించలేదు. తన కుటుంబంలో శాంతి, అనారోగ్యంతో బాధపడుతున్నవారికి వైద్యం చేయించడంపై దృష్టి సారించారు. ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభమైన సుదీర్ఘ విడాకుల ప్రక్రియతో ఏంజెలీనా అలసిపోయింది" అని సైమన్ పేర్కొన్నారు.
అధికారికంగా తెలియలేదు!
కాగా, ఏంజెలీనా జోలి విడాకుల ఒప్పందంపై న్యాయమూర్తి సంతకం చేయలేదని తెలుస్తోంది. ఇంకా విడాకులపై కోర్టు నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. అలాగే ఏంజెలీనా తరఫు న్యాయవాది సైమన్, బ్రాడ్ పిట్ తరఫు న్యాయవాదికి సోమవారం రాత్రి ఈ-మెయిల్ పంపినా ఇంకా రిప్లై రాలేదని తెలుస్తోంది.
ఒక్కటైన ఆస్కార్ విజేతలు
హాలీవుడ్ నటులు, అస్కార్ విజేతలైన ఏంజెలీనా జోలి(49), బ్రాడ్ పిట్(61) కొనాళ్ల పాటు డేటింగ్ చేశారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఆరుగురు సంతానం. అయితే 2016లో యూరప్ నుంచి ఒక ప్రైవేట్ జెట్ ప్రయాణిస్తున్న సమయంలో బ్రాడ్ పిట్ తనపట్ల, పిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తించారని జోలీ విడాకుల కోసం దాఖలు చేసింది. ఆ తర్వాత నుంచి విడివిడిగా ఉంటున్నారు. 2019లో ఈ దంపతులకు విడాకులు ముంజూరయ్యాయి. అయితే ఆస్తుల విభజన జరగలేదు. అంతేకాదు తమ ఆరుగురి పిల్లల బాధ్యతను జాయింట్ కస్టడిలో ఉంచాలని వీరిద్దరూ డిమాండ్ చేస్తున్నారు.
ఈ కేసును పరిష్కరించడానికి జోలి, బ్రాడ్ పిట్ నియమించుకున్న ఒక ప్రైవేట్ న్యాయమూర్తి వారి పిల్లల జాయింట్ కస్టడిపై ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయం నచ్చక జోలీ ఆయన్ను కేసు నుంచి తొలగించాలని పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అప్పీల్ కోర్టు ప్రైవేట్ న్యాయమూర్తిని తొలగించింది. తాజాగా ఆస్తుల విభజన, పిల్లల సంరక్షణపై బ్రాడ్ పిట్, ఏంజెలీనా జోలీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.