Jaiswal Catch Out Controversy : బాక్సింగ్ డే టెస్టులో మరో కాంట్రవర్సీ అయ్యింది. టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ (84 పరుగులు) రెండో ఇన్నింగ్స్‌లో నిలకడగా అడుతూ ఔటైన తీరు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. మరోసారి సాంకేతికతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జైస్వాల్ కచ్చితంగా ఔట్ కాదంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.
ఇదీ జరిగింది
ఆసీస్ నిర్దేశించిన 340 పరుగుల లక్ష్య ఛేదనలో భారత స్టార్ బ్యాటర్లు విఫలమయ్యారు. కానీ, జైస్వాల్ మాత్రం తొలి నుంచీ ఓంటరి పోరాటం చేశాడు. అయితే 70.5 ఓవర్ వద్ద పాట్ కమిన్స్ వేసిన బంతిని జైస్వాల్ ఆడేందుకు ప్రయత్నించాడు. అది మిస్ కావడం వల్ల నేరుగా వికెట్ కీపర్ చేతిలో పడింది. దీంతో ఆసీస్ ప్లేయర్లు ఔట్ అంటూ అప్పీలు చేశారు. కానీ, ఫీల్డ్ అంపైర్ మాత్రం ఔట్ ఇవ్వలేదు. దీంతో వెంటనే కమిన్స్ రివ్యూ కోరాడు.
థర్డ్ అంపైర్ రిప్లైలో పరిశీలించగా, బంతి అతడి బ్యాట్‌ను తాకినట్లు కనిపించలేదు. స్నికో మీటర్‌లోనూ ఎలాంటి స్పైక్స్ రాలేదు. అయితే స్పైక్స్ రాకపోయినప్పటికీ బంతి గమనం మారడం వల్ల థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. ఈ నిర్ణయంపై జైస్వాల్ తీవ్ర అసహనం వ్యక్తంచేస్తూ మైదానాన్ని వీడాడు. ప్రస్తుతం ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది.
స్పందించిన కెప్టెన్
'యశస్వి జైస్వాల్ ఔట్ విషయంలో ఏం జరిగిందో అర్థం కావడం లేదు. మామూలుగా చూస్తే బంతి తాకినట్లు అనిపించింది. కానీ టెక్నాలజీ కూడా వందశాతం ఫలితాలు ఇవ్వలేకపోతోంది. చివరికి ఔట్ ఇవ్వడం వల్ల భారత్‌కు నష్టమే జరిగింది. ఇక్కడా మాకు దురదృష్టం ఎదురైంది' అని రోహిత్ అన్నాడు.
కాగా, బాక్సింగ్ డే టెస్టులో యశస్వి అద్భుతంగా రాణించాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీలు బాదాడు. వరుసగా 82, 84 స్కోర్లు నమోదు చేశాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్ 200+ బంతులు ఎదుర్కొని క్రీజులో పాతుకుపోయాడు. కానీ, మరో ఎండ్‌లో అతడికి సహకారం అందిచే బ్యాటర్ల కరవవ్వడం వల్ల టీమ్ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది.