AP CM Chandrababu Richest CM : దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలిచారు. అతని తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం ఆస్తుల విలువ రూ.931 కోట్లు కాగా, అప్పు రూ.10 కోట్లుగా ఉంది. ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలను సోమవారం అసోసియేషన్ ఫర్ డెమోక్టరిక్ రిఫార్మ్స్ విడుదల చేసింది.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఆయన పేరిట రూ.36 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆయన సతీమణి భువనేశ్వరి పేరిట రూ.895 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇందులో హెరిటేజ్ ఫుడ్స్‌లో ఉన్న షేర్లనూ కలిపి లెక్కించారు. కేవలం రూ.15 లక్షల ఆస్తితో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ జాబితాలో అట్టడుగు స్థానంలో నిలిచారు.
ఏడీఆర్ నివేదికలో వివరాలు :
దేశంలోని అందరి ముఖ్యమంత్రుల సగటు ఆదాయం ఏడాదికి రూ.13,64,310గా ఉంది.
31 మంది ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తి రూ.1,630 కోట్లుగా ఉంది.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రుల సగటు ఆస్తి రూ.52.59 కోట్లుగా ఉంది.
సంపన్న ముఖ్యమంత్రుల్లో ఏపీ సీఎం చంద్రబాబు మొదటి స్థానం సంపాదించగా, రెండో స్థానంలో ఉన్న పెమా ఖండూ(అరుణాచల్ ప్రదేశ్) ఆస్తి విలువ రూ.332 కోట్లు. ఆయనకు అత్యధికంగా రూ.180 కోట్ల అప్పు ఉంది.
మూడో స్థానంలో ఉన్న సిద్ధరామయ్య(కర్ణాటక) ఆస్తి రూ.51 కోట్లుగా ఉంది. ఆయనకు రూ.23 కోట్ల అప్పు సైతం ఉంది.
అట్టడుగున పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉండగా ఆమె ఆస్తి రూ.15 లక్షలుగా ఉంది.
రూ.55 లక్షల ఆస్తులతో జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఉన్నారు.
కేరళ సీఎం పినరయి విజయన్ అట్టడుగు నుంచి మూడో స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తులు రూ.1.18 కోట్లుగా ఉంది.
అత్యంత శక్తివంతమైన సీఎంగా అగ్రస్థానంలో చంద్రబాబు : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఐదో స్థానంలో ఉండగా, ముఖ్యమంత్రుల్లో అగ్రస్థానంలో నిలిచినట్లు ఇండియా టుడే గత నెలలో ప్రకటించింది. 2024లో దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, నాయకుల పనితీరు ఆధారంగా వారి శక్తిసామర్థ్యాలను అంచనా వేసింది. 2019 ఎన్నికల్లో ఓటమితో రాష్ట్రంలో అధికార కోల్పోయినా జైలుకెళ్లినా 2024 ఎన్నికల్లో ఫీనిక్స్ పక్షిలా ఎగిరి రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో అధికారం దక్కించుకున్నారు. అలాగే కేంద్రంలోనూ బలమైన పాగా వేశారు. సొంతంగా 16 మంది లోక్‌సభ సభ్యులు, కూటమితో కలిపి 21 మంది ఎంపీలను గెలిపించుకొని ఎన్డీఏలో రెండో అతిపెద్ద పార్టీగా టీడీపీని నిలిపారు.
మోస్ట్ పవర్ఫుల్ పొలిటీషియన్‌గా మోదీ- ఐదో ప్లేస్‌లో చంద్రబాబు- సీఎం జాబితాలో టాప్ కూడా ఆయనే
'నేను జైల్లో ఉన్నప్పుడు అలా చేశారు - ధైర్యంగా ఎదుర్కోవడంతో నా జోలికి ఎవరూ రాలేకపోయారు'