Expired Milk Packets Distribution At Anganwadi Centres : కాలం చెల్లిన పాలు, మురిగిపోయి దుర్వాసన వస్తున్న గుడ్లు పంపిణీ చేస్తున్నారని అంగన్వాడి కేంద్రానికి గ్రామస్థులు తాళాలు వేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. దుమ్ముగూడెం మండలం రామకృష్ణాపురం గ్రామంలో గర్భిణీలకు, బాలింతలకు, చిన్న పిల్లలకు కాలం చెల్లిపోయి రెండు నెలలు దాటిన పాలను పంపిణీ చేయడంతో గ్రామస్తులు అంగనవాడి ఉపాధ్యాయురాలితో వివాదానికి దిగారు. ఈ విషయంపై అడగటానికి వెళ్లిన గ్రామస్థులపై అంగన్వాడి ఉపాధ్యాయురాలు దొరుసుగా సమాధానం చెప్పడంతో అంగన్వాడి కేంద్రానికి గ్రామస్తులు తాళాలు వేశారు.
అంగన్వాడి కేంద్రాలకు పాలు, గుడ్లను సరఫరా చేసే కాంట్రాక్టర్ నాణ్యతలేని పాలను సరఫరా చేస్తున్నారని 50 గ్రాముల కోడిగుడ్లను సరఫరా చేయాల్సి ఉండగా 25 గ్రాముల కంటే తక్కువ బరువు ఉన్న గుడ్లను సరఫరా చేస్తున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడిగుడ్లు చాలా చిన్నదిగా ఉన్నాయని, కాంట్రాక్టర్ డబ్బులు మిగిల్చుకోవడానికి ఇలాంటి చిన్న గుడ్లను మండల వ్యాప్తంగా సరఫరా చేస్తున్నారని వారు ఆరోపించారు. పాడైన పాలను పంపిణీ చేయడంతో ప్యాకెట్ విప్పి చూడగా పాలు దుర్వాసన వస్తున్నాయని, డేట్ చూడగా ఎక్స్పైరీ దాటి రెండు నెలలు అయిందని గుర్తించి తాగకపోవడంతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడినట్లు గ్రామస్థులు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్కువ శాతం ప్రజలు అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులే. వారికి కాలం చెల్లిన తేదీలు చూడడం రాకపోవడంతో కాలం చెల్లిన పాలనే తాగుతూ అనారోగ్యాల పాలవుతున్నారని అంటున్నారు. మరోవైపు గిరిజనులకు పౌష్టికాహారం అందకపోవడంతో అనారోగ్యంతో భాద పడతున్నారని, సంబంధిత ఉన్నతాధికారులు వచ్చి సమాధానం చెప్పేంత వరకు అంగన్వాడి కేంద్రానికి తాళాలు తీయమని గ్రామస్థులు స్పష్టం చేశారు.
"అంగన్వాడీ కేంద్రంలో కాలం చెల్లిన పాలు ప్యాకెట్, చెడిపోయిన గుడ్లు ఇచ్చారు. కాలం చెల్లిన పాల ప్యాకెట్‌ను గమనించడం వల్ల వాటిని తాగలేదు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. నూనె, పప్పు, ఇతర పదార్థాలు కూడా చాలా తక్కువగా ఇచ్చారు. అడిగితే తరువాత ఇస్తామని చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం."- రామకృష్ణాపురం గ్రామస్థులు
అతడు పోసిన 'పాలు' తాగి మంచం పట్టిన ఫ్యామిలీ - అసలు ఏం జరిగిందంటే?