IND VS BAN First Test Pant Century :దాదాపు 20 నెలల తర్వాత టెస్టుల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెట్ జట్టు స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్ (109: 128 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్స్‌లు) తన సత్తా ఏంటో మరోసారి నిరూపించాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో అదిరే ప్రదర్శన చేశాడు. తనదైన శైలిలో దూకుడుగా ఆడాడు. సాధారణంగా టెస్టుల్లో నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంటారు. కానీ, పంత్ మాత్రం మిగతా ఫార్మాట్లతో పోలిస్తే టెస్టుల్లోనే వేగంగా పరుగులు సాధిస్తాడన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బంగ్లాతో జరుగుతోన్న టెస్ట్‌లోనూ ఇదే దూకుడును ప్రదర్శించి శతకం బాదేశాడు. దీంతో 637 రోజుల తర్వాత అతడు టెస్టు క్రికెట్‌లో సెంచరీ బాదినట్టైంది. ఈ పోరులో 124 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను తాకిన పంత్ బంగ్లాదేశ్ బౌలర్ మెహిదీకి రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో గిల్‌తో నాలుగో వికెట్‌కు 167 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది.
ధోనీ రికార్డ్‌ను సమం చేసిన పంత్ - టీమ్ ఇండియా తరఫున వికెట్ కీపర్లలో అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్ల జాబితాలో ధోనీని పంత్ సమం చేశాడు. మహీ 144 ఇన్నింగ్స్‌ల్లో ఆరు శతకాలు చేయగా, పంత్ మాత్రం 58 ఇన్నింగ్స్‌ల్లోనే దీన్ని పూర్తి చేయడం విశేషం. వీరిద్దరి తర్వాత వృద్ధిమాన్ సాహా 54 ఇన్నింగ్స్‌ల్లో 3 శతకాలు బాదాడు.
Shubman Gill Century VS Bangladesh : టీమ్ ఇండియా యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్(119*: 176 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) అదిరే ప్రదర్శన చేస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన అతడు రెండో ఇన్నింగ్స్‌లో నిలకడగా పరుగులు చేస్తూ రాణిస్తున్నాడు. బంగ్లా పేస్, స్పిన్‌ను ఎదుర్కోని మూడంకెల స్కోరును చేశాడు. ఈ క్రమంలోనే అతడు కూడా సెంచరీ బాదేశాడు. 158 బంతుల్లో శతకం పూర్తి చేశాడు. గిల్‌కు ఇది ఐదో శతకం.