Ajay Jadeja Comments On Virat Kohli : బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ పెర్త్ వేదికగా ఇటీవల జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ బాదాడు. దీంతో అతడి ఫామ్‌పై వస్తున్న విమర్శలకు గట్టిగా సమాధానమిచ్చాడు. తాజాగా ఇదే విషయంలో కింగ్ కోహ్లీని ప్రశంసలతో ముంచెత్తాడు భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా. కోహ్లీ ఫామ్‌ను అనుమానించేవాళ్లు ఉంటే రెస్ట్ ఇన్ పీస్ అవ్వొచ్చని ఘాటుగా స్పందించాడు. "అతడి పేరే స్వయంగా అన్ని విషయాలు చెబుతోంది. అతడిని అనుమానించేవాళ్లు ఎవరైనా ఉంటే వారు రెస్ట్ ఇన్ పీస్ కావొచ్చు. జీనియస్‌లు రాత్రి రాత్రే పుట్టరు." అని జడేజా కోహ్లీ విమర్శకుల నోళ్లు మూయించారు.
అయితే, పెర్త్‌లో కోహ్లీ సాధించిన సెంచరీ అతడి నైపుణ్యానికి, ఒత్తిడికి తట్టుకునే తీరుకు, సంకల్పానికి నిదర్శనం. ఫామ్‌పై విమర్శలు ఎదుర్కొన్న విరాట్, తన సూపర్ సెంచరీతో విమర్శలకు తగిన సమాధానం ఇచ్చాడు. పెర్త్ టెస్ట్‌లో కోహ్లీ చేసిన ప్రదర్శన జట్టు విజయంలో కీలకంగా నిలిచింది. ఒత్తిడిలో రాణించడం, ముందుండి నడిపించగల అతడి సామర్థ్యానికి పెర్త్ ఫీట్ నిదర్శనం.
మీరూ కోహ్లీలా ఆడండి! : రికీ పాంటింగ్
ఆసీస్ బ్యాటర్లు మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ పేలవ ఫామ్ నుంచి బయటపడాలంటే ముందు తమ ఆటపై విశ్వాసంతో ఉండాలని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు. అందుకు టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఉదాహరణగా చూపించాడు.
"పెర్త్ మ్యాచ్‌లో బ్యాటర్లందరిలో లబుషేన్ ఎక్కువగా ఇబ్బందికి గురయ్యాడు. అతడు క్లిష్టమైన వికెట్‌పై అత్యుత్తమ బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు. కానీ తిరిగి ఫామ్‌ను అందుకోవడానికి అతడు మార్గాలను అన్వేషించాలి. విరాట్ కోహ్లీ తన ఆటపై నమ్మకముంచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కంటే సెకండ్ ఇన్నింగ్స్‌లో పూర్తి భిన్నమైన ఆటగాడిగా కనిపించాడు. ప్రత్యర్థులపై పోరాడే బదులు తన బలాలపై దృష్టిపెట్టాడు. స్మిత్, లబుషేన్ కూడా తమదైన శైలిలో అలా చేయాలి" అని పాంటింగ్ చెప్పాడు. పెర్త్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో లబుషేన్ 5 పరుగులే చేయగా స్మిత్ 17 పరుగులతో సరిపెట్టుకున్నాడు.