Tiger Attacks in Komaram Bheem District : వరుస దాడులు చేస్తున్న పెద్దపులి తీరుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. భారీ ఆకారం, భీకరమైన గాండ్రింపుతో వెళుతున్న పెద్దపులిని చూస్తూ భయాందోళనకు గురువుతున్నారు. పత్తి తీసే సమయంలోనే పులి రైతులపై దాడి చేయడం పరిపాటిగా మారుతోంది. ఉమ్మడి జిల్లాలోకి తోడును వెతుక్కుంటూ వస్తున్న పులులు మనుషులు, పుశువులపై దాడి చేసి చంపేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో పులిని ట్రాకింగ్ చేసే విషయంలో అధికారులు విఫలమవుతున్నారని విమర్శలు వెల్లవెత్తుతున్నాయి.
మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి అడవి నుంచి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు వస్తున్న పులులు నవంబరులోనే దాడులు చేస్తున్నాయి. 2020 నవంబర్ 12న దహెగాం మండలం దిగిడ గ్రామానికి చెందిన విఘ్నేష్ (22), అదే నెల 29న పెంచికల్‌పేట్ మండలంలోని నిర్మల (18) అనే మహిళను, 2023లో నవంబర్ 23న వాంకిడి మండలంలోని ఖానాపూర్‌లో సిడాం భీము (60)పై దాడి చేసి బలితీసుకుంది. మళ్లీ తాజాగా 2024 నవంబర్ 29న గన్నారం గ్రామానికి చెందిన మోర్లే లక్ష్మిపై పులి దాడి చేసి హతమార్చింది. కాగా ఇవాళ కూడా సిర్పూర్(టి) మండలం దుబ్బగూడకు చెందిన రైతు సురేశ్‌పై దాడి చేయగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆ సమయాల్లో బయటకు రావొద్దు : నజ్రుల్‌నగర్ విలేజ్‌నంబర్ 13-11 మధ్య ప్రాంతాల్లో పులి సంచరిస్తోందని అటవీ శాఖ అధికారి నీరజ్‌కుమార్ తెలిపారు. పక్కనే సుమారు 7 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఇటికలపహాడ్ అడవుల నుంచి పులి వచ్చి ఉండొచ్చని భావించారు. మరో రెండు రోజుల వరకు ఈ ప్రాంతంలోనే పులి తిరిగే అవకాశం ఉందని చెప్పారు. ప్రజలు ఉదయం ఏడు గంటలలోపు, సాయంత్రం 5 గంటల తరువాత బయటకు రావొద్దని హెచ్చరించారు. ఈ ప్రాంతంలో తమ సిబ్బందితో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ఎక్కడి నుంచి వచ్చింది : మోర్లే లక్ష్మి (21) పై దాడి చేసి చంపేసిన పులి ఇటికలపహాడ్ నుంచి వచ్చినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. గురువారం సాయంత్రం సిర్పూర్(టి) మండలంలో లింబుగూడ వద్ద పెద్దపులి అటవీశాఖ అధికారులకు కనిపించింది. అనంతరం పెద్దబండ మీదుగా విలేజ్ నంబర్ 11కు వెళ్లింది. పులి కదలికలపై అధికారులకు సమాచారం ఉన్నా ట్రాకింగ్ విషయంలో సమన్వయం లేకపోవడంతోనే గ్రామ ప్రజలకు పులి గురించి పూర్తిస్థాయిలో తెలియజేయలేదని తెలుస్తోంది. పెద్దబండ ఘటన జరిగిన చోటుకు దాదాపు 12 -15 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. రాత్రి కనిపించిన పెద్దపులి ఉదయం వరకు సుమారు 15 కిలోమీటర్లు నడిచి మహిళను బలితీసుకుంది.