True love between husband and wife : ప్రస్తుత కాలంలో పరిస్థితులన్నీ బాగున్నప్పటికీ, చిన్న చిన్న కారణాలకే గొడవలు పడి, విడిపోయే భార్యాభర్తలు ఈ జంటను చూసి నేర్చుకోవాలి. ఓ ప్రమాదంలో రెండు కాళ్లూ కోల్పోయిన భార్యకు అన్నీ తానై కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు ఈ భర్త. ఈ క్రమంలో వివాహ బంధానికి సరైన అర్థాన్ని చాటి చెబుతున్నారు ఈ దంపతులు. పూర్తి వివరాల్లోకి వెళితే,
ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయి : హైదరాబాద్లోని చందానగర్లో నివసిస్తున్న మారెప్పకు వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన అనంతితో 2017లో పెళ్లి జరిగింది. వారికి ఇద్దరమ్మాయిలు ఐశ్వర్య (6), సాక్షి(3) ఉన్నారు. ఈ దంపతులు ఇద్దరూ భవన నిర్మాణ కార్మికులే. చక్కగా సాగిపోతున్న సంసారంలో ఒక్కసారిగా అనుకోని సంఘటన చోటుచేసుకుంది. 2022లో తాండూరులో ట్రైన్ ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు అనంతి కిందపడిపోయింది. దీంతో చక్రాల కింద కాళ్లు నలిగిపోయాయి. ప్రాణాలతో బయటపడిన ఆమెకు డాక్టర్లు రెండు కాళ్లను తొలగించారు.
భార్యకు అన్నీ తానై సేవలు : సాఫీగా సాగిపోతున్న జీవితంలో ఇలా జరిగిందే అని మారెప్ప కుంగిపోలేదు. అప్పటి నుంచి మారెప్ప భార్య అలనాపాలనా చూస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఇంట్లో అన్నీ తానై సేవ చేస్తున్నారు. బయటకు వెళ్లాలంటే ఇలా ఎత్తుకుని వెళ్తుంటారు. తన భార్యకు అధికారులు దివ్యాంగ పింఛన్తో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని మారెప్ప కోరుతున్నారు.