Ginger Health Benefits : ప్రతి రోజూ మనం వంటలో వాడే అల్లం వంటకాలకు మంచి రుచిని అందిస్తుంది. అయితే, అల్లం వంటలకు కేవలం మంచి రుచిని ఇవ్వడమే కాకుండా ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమెటరీ గుణాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ శ్రీలత చెబుతున్నారు. ఇంకా అనేక అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని వివరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
"ఆకలిని పెంచడంలో అల్లం బాగా సహాయ పడుతుంది. ముఖ్యంగా కీమోథెరపీ, రేడియోథెరపీ, క్యాన్సర్ బాధితులకు ఆకలి తగ్గిపోతుంది. అలాగే ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి కొన్నిసార్లు ఆకలిగా అనిపించదు. అలాంటివారికి నీళ్లల్లో నిమ్మరసం, అల్లం కలిపి ఇవ్వడం వల్ల ఆకలి పెరుగుతుంది. జలుబు, దగ్గు, తలనొప్పి, మైగ్రేన్, నడుంనొప్పి, వెన్నుపూస నొప్పి, మోకాలి నొప్పులు, జాయింట్ పెయిన్స్ వంటి సమస్యలను తగ్గించడానికి అల్లం బాగా పనిచేస్తుంది. ఇందులో నొప్పి, వాపును తగ్గించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. రోజుకు 2 నుంచి 5 గ్రాముల అల్లంను రెండు వారాల పాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇంకా దగ్గు, జలుబు ఉన్నప్పుడు అల్లం తింటే వెంటనే తగ్గుతుంది."
---డాక్టర్ శ్రీలత, పోషకాహార నిపుణులు
కీళ్ల నొప్పులకు చక్కని పరిష్కారం: కీళ్ల నొప్పులను అల్లం తగ్గిస్తుందని అనేక అధ్యయనాల్లో తేలింది. కీళ్ల ఆరోగ్యానికి అవసరమయ్యే మాంగనీస్, మెగ్నీషియం, కాపర్, బీ6 విటమిన్లు అల్లంలో పుష్కలంగా ఉన్నాయని.. ఫలితంగా వీటిని తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పి నుంచి బయటపడవచ్చని తెలిపారు. అల్లంలోని యాంటీఆక్సిడెంట్ గుణాలు మంట, వాపు, వికారాన్ని తగ్గిస్తాయని చెబుతున్నారు. అలాగే బరువు తగ్గడం, జీర్ణక్రియను మెరుగుపర్చుకోవడంలో అల్లం మనకు ఎంతో సహాయపడుతుందంటున్నారు.
కడుపునొప్పి, అజీర్తికి చెక్: కడుపునొప్పి, పొట్ట ఉబ్బరం, వికారం, అజీర్తితో బాధపడేవారు అల్లం తీసుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుందని డాక్టర్ శ్రీలత చెబుతున్నారు. పాలు లేకుండా అల్లం టీ లేదా బ్లాక్ టీ తాగడం వల్లన కొద్ది నిమిషాల్లోనే కడుపునొప్పి తగ్గుతుందని వివరిస్తున్నారు. మహిళలకు నెలసరి సమయంలో విపరీతమైన కడుపునొప్పి వస్తుంటుంది. అలాంటి సమయాల్లో ట్యాబ్లెట్ల కన్నా అల్లం తీసుకోవడం వల్ల ఎక్కువ లాభం ఉంటుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
క్యాన్సర్‌కు విరుగుడు: ముఖ్యంగా ప్రాణాంతక క్యాన్సర్‌కు విరుగుడుగా కూడా అల్లం పనిచేస్తుందని డాక్టర్ శ్రీలత చెబుతున్నారు. కొలొరెక్టర్, లివర్ క్యాన్సర్లపై పోరాడే గుణాలు అల్లంలో సమృద్ధిగా లభిస్తాయని తెలిపారు. దీంతో రోజూ అల్లం తీసుకోవడం వల్ల వివిధ క్యాన్సర్ల ముప్పు నుంచి బయటపడవచ్చని సూచిస్తున్నారు. ఇంకా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. కానీ, అల్లం తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుందని వివరిస్తున్నారు. ఇంకా పచ్చి అల్లం లేదా అల్లం నీరు, అల్లం టీ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుందని అంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
అలర్ట్ : ఈ 10 వస్తువులు తాకితే వెంటనే చేతులు కడగాలట! అవేంటో మీకు తెలుసా?
స్పీడ్ వాకింగ్ లేదా ఎక్కువ దూరం నడవాలా? ఏది చేస్తే బరువు తగ్గుతారు? నిపుణులు ఏం అంటున్నారు?