Ajwain Benefits in Telugu : కొంతమంది వాతావరణంలో చిన్న మార్పులు వచ్చినా దగ్గు, జలుబు వంటి బారిన పడుతుంటారు. అలాగే, ప్రస్తుతం మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది వయసుతో సంబంధం లేకుండా అజీర్తి, గ్యాస్ ట్రబుల్ వంటి జీర్ణ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఎక్కువ మంది పైన పేర్కొన్న సమస్యలతో పాటు ఆ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ట్యాబ్లెట్లతో తగ్గించుకుంటుంటారు. అయితే, వీటిని తరచూ వాడడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి అజీర్తి, దగ్గు, గ్యాస్ ట్రబుల్.. వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ట్యాబ్లెట్స్ కాకుండా వంటింట్లో ఉండే "వాము"తో కూడా వాటికి ఈజీగా చెక్ పెట్టొచ్చంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అదెలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
దగ్గును తరిమేస్తుంది!
చలికాలం చాలా మంది ఎక్కువగా దగ్గు, ఆస్తమా.. ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతుంటారు. అలాంటి టైమ్‌లో వాముని తీసుకుంటే అందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు.. ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి చాలా బాగా సహాయపడతాయంటున్నారు ఆయుర్వేద కన్సల్టెంట్ డాక్టర్ గాయత్రీ దేవి. అదేవిధంగా వాములోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఆర్థ్రైటిస్ వల్ల ఏర్పడే నొప్పి నుంచి మంచి రిలీఫ్‌ని కలిగిస్తాయంటున్నారు.
ఎసిడిటీకి చెక్ : మీరు ఎసిడిటీతో బాధపడుతున్నట్లయితే వామును ఇలా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఒక బౌల్లో గ్లాసు వాటర్ తీసుకొని అందులో ఒక టీస్పూన్ చొప్పున వాము, జీలకర్ర వేసి బాగా మరిగించాలి. ఆపై ఆ మిశ్రమాన్ని కాస్త చల్లారాక వడకట్టుకొని తాగితే ఎసిడిటీ నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుందంటున్నారు.
నోటి శుభ్రతకు! వాము ఆయిల్‌ను టూత్‌పేస్ట్‌ల్లో, మౌత్ వాష్‌ల్లో యూజ్ చేస్తారు. అది నోటిలోని బ్యాక్టీరియాతో పోరాడి నోటి నుంచి దుర్వాసన రాకుండా చేస్తుంది. అలాగే, కొద్దిగా వామును నోట్లో వేసుకుని నమిలినా మంచి ఫలితం ఉంటుందంటున్నారు.
గుండెకు మేలు : వాములో ఉండే నియాసిన్ గుండె సంబంధిత సమస్యలు దరి చేరకుండా కాపాడడంలో సహాయపడుతుంది. కాబట్టి, రోజూ పరగడుపున కొంచెం వామును నీళ్లలో వేసి మరిగించి తాగితే గుండె సంబంధిత వ్యాధులు రాకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు.
మహిళలకు ఎంతో ప్రయోజనం : వాము గర్భం దాల్చిన మహిళలకు, పాలిచ్చే తల్లులకు చాలా బాగా ఉపయోగపడుతుంది. గర్భిణులకు సాధారణంగా ఎదురయ్యే మలబద్ధకం, అజీర్తిని దూరం చేయడంలో ఇది సహాయపడుతుంది. అలాగే గర్భవతులు రోజూ వామును తీసుకుంటే బాడీలో రక్తం శుభ్రపడటంతో పాటు రక్తప్రసరణ బాగా జరుగుతుందట. అదేవిధంగా బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచడానికి వాము తోడ్పడుతుందంటున్నారు.
మరికొన్నింటిని చూస్తే..
- పీరియడ్స్ టైమ్‌లో చాలామంది మహిళలకు కడుపునొప్పి రావడం సహజం. అలాంటి సమయంలో వేయించిన వామును పాలలో కలిపి, వేడి చేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుందంటున్నారు.
- పంటి నొప్పులు దూరం చేయడంలో వాము చాలా బాగా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కొద్దిగా వాము వేసి మరిగించాలి. ఆపై అవి కాస్త గోరువెచ్చగా మారాక నోట్లో వేసుకుని పుక్కిలిస్తే చాలట. అదేవిధంగా.. వాము నూనెను కీళ్ల నొప్పులున్న చోట రాస్తే నొప్పి తగ్గిపోతుందంటున్నారు.
- రోజువారీ ఆహారంలో వామును భాగం చేసుకోవడం వల్ల స్థూలకాయం, అధిక బరువు నుంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు డాక్టర్ గాయత్రీ దేవి.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవీ చదవండి :
అద్దిరిపోయే "వామాకు పచ్చడి" - ఇలా చేసుకుని తింటే జలుబు, దగ్గు మాయం!
జామకాయ, నిమ్మకాయ తింటే జలుబు చేస్తుందా? - చలికాలంలో అవి తినకూడదా!