ICC Champions Trophy 2025 : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వేదికల విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. 2025లో జరగనున్న టోర్నీ కోసం ఆతిథ్యం ఇవ్వడానికి సుముఖత చూపించింది. ఇందులో భాగంగా పాక్‌లోని లాహోర్, రావల్పిండి, కరాచీలను ఎంపిక చేసింది. తమ షెడ్యూల్‌తో పాటు ఈ నగరాల పేర్లను ఐసీసీకి పంపించింది.
ఇదిలా ఉండగా, ఐసీసీ భద్రతా బృందం పాకిస్థాన్‌కు వచ్చి అక్కడి వేదికలను పరిశీలించిందట. అంతే కాకుండా వాళ్లు చేసిన ఏర్పాట్లను చూసి ఓకే చెప్పినట్లు సమాచారం.
ఇక పాకిస్థాన్ చివరగా 1996 ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌నకు ఆతిథ్యమిచ్చింది. ఆ తర్వాత 2009 ఛాంపియన్స్ ట్రోపీ, 2011 వరల్డ్ కప్ నిర్వహించే ఛాన్స్ వచ్చింది. కానీ 2009లో లాహోర్‌లో శ్రీలంక ప్లేయర్లపై ఉగ్రదడి జరగడం వల్ల భద్రతా కారణాల రీత్యా ఆ రెండు ఈవెంట్లను అక్కడి నుంచి తరలించారు. చివరిసారిగా 2012-2013లో టీమ్ ఇండియా పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగాయి. ఆ సమయంలో పాకిస్థాన్ క్రికెట్ టీమ్ భారత్‌లో పర్యటించింది. కానీ ఆ తర్వాత నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
ఇరు దేశాల మధ్య సరిహద్దు, ఇతర సమస్యల కారణంగా రెండు జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదు. ఐసీసీ ఈవెంట్‌లలో మాత్రమే తలపడుతున్నాయి. గతేడాది పాకిస్థాన్ వేదికగా జరగాల్సిన ఆసియా కప్‌ను కూడా హైబ్రిడ్ మోడల్‌లోనే నిర్వహించారు. ఎందుకంటే టీమ్ఇండియాను పాకిస్థాన్‌కు పంపేందుకు భారత ప్రభుత్వం నిరాకరించడంతో ఇలా చేశారు.