Tamilnadu Style Vankaya Masala Curry Recipe : వంకాయ పేరు చెప్పగానే చాలా మందికి గుత్తొంకాయ కర్రీనే ముందుగా గుర్తొస్తుంది. అలాకాకుండా ఓసారి ఇలా "తమిళనాడు స్టైల్లో వంకాయ మసాలా కర్రీని" ట్రై చేయండి. టేస్ట్ అద్దిరిపోతుంది! ఇది బగారాలోకి సూపర్ కాంబినేషన్. ఆదివారం అలా బగారా వేసుకొని అందులోకి సైడ్ డిష్‌గా ఈ వంకాయ మసాలా కర్రీని చేసుకుని తింటుంటే కలిగే ఆ ఫీలింగ్ అద్భుతంగా ఉంటుంది! నాన్‌వెజ్ రెసిపీలను మించిన టేస్ట్‌తో తిన్నాకొద్దీ తినాలనిపిస్తుంది ఈ కర్రీ. మరి, ఇంకెందుకు ఆలస్యం అందుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- గుత్తొంకాయలు - 7
- పల్లీలు - 3 టేబుల్‌స్పూన్లు
- జీడిపప్పు పలుకులు - 2 టీస్పూన్లు
- తెల్ల నువ్వులు - ఒకటిన్నర టేబుల్‌స్పూన్లు
- నూనె - ముప్పావు కప్పు వరకు
- ఆవాలు - అరటీస్పూన్
- మెంతులు - కొన్ని
- మిరియాలు - అరటీస్పూన్
- వెల్లుల్లి రెబ్బలు - 8
- జీలకర్ర - 1 టీస్పూన్
- కరివేపాకు - 2 రెమ్మలు
- ఉల్లిపాయ తరుగు - 1 కప్పు
- టమాటాలు - 2
- ధనియాల పొడి - 1 టేబుల్‌స్పూన్
- కారం - రుచికి తగినంత
- పసుపు - పావుటీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- చింతపండు - చిన్న నిమ్మకాయ సైజంత
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
నోరూరించే తెలంగాణ స్టైల్ "వంకాయ పచ్చికారం" - వేడివేడి అన్నం, జొన్న రొట్టెల్లోకి కిర్రాక్ కాంబినేషన్!
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా గుత్తొంకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి చాకుతో అడుగు వైపు నాలుగు భాగాలుగా చీల్చుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయలు, టమాటాలను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై చిన్న కడాయి పెట్టుకొని పల్లీలు, జీడిపప్పు పలుకులు వేసి లో ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోవాలి. అవి వేగాక తెల్ల నువ్వులు వేసుకొని అవి చిట్లే వరకు వేపుకోవాలి.
- ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో చల్లారిన పల్లీల మిశ్రమాన్ని వేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
- అనంతరం స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక చీల్చుకున్న వంకాయలను వేసి కలిపి మూతపెట్టి 70% వరకు ఉడికించుకోవాలి. ఆపై వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు అదే నూనెలో ఆవాలు, మెంతులు, మిరియాలు వేసి చిట్లే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
- తాలింపు వేగాక ముందుగా తరిగి పెట్టుకున్న సన్నని ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు వేసి స్కిన్ సెపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి.
- అప్పుడు అందులో ధనియాల పొడి, కారం, పసుపు, ఉప్పు వేసి కలిపి మరికాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని మసాలాల నుంచి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
- అనంతరం ఆ మిశ్రమంలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు వేసి, 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని కలిపి మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
- ఆ తర్వాత ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న పల్లీల పొడి మిశ్రమాన్ని వేసి ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఆపై మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి మూత పెట్టి మధ్యమధ్యలో కలుపుతూ కూరలో నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి.
- ఇక ఆఖర్లో కొత్తిమీర తరుగు వేసుకొని కలిపి దింపేసుకుంటే చాలు. అంతే, ఎంతో రుచికరంగా ఉండే నోరూరించే "వంకాయ మసాలా కర్రీ" రెడీ!
లఖ్‌నవూ స్పెషల్ "మలై గుత్తొంకాయ కుర్మా" - ఒక్కసారి టేస్ట్ చేశారంటే జిందగీ ఖుష్ అయిపోతుంది!