Champions Trophy 2025 : 2025 ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించేలా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)ను ఒప్పించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కృషి చేస్తోంది. అధికారికంగా కాకుండా తెరవెనుక ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది. భద్రతా కారణాలు వల్ల పాక్‌లో అడుగుపెట్టమని టీమ్ ఇండియా చెబుతుండటంతో ఐసీసీ పాక్‌ను ఒప్పించే పనిలో పడింది.
టోర్నమెంట్ సజావుగా సాగేందుకు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్‌ను ఒప్పించేందుకు ఐసీసీ పని చేస్తోంది. ప్రతిపాదిత హైబ్రిడ్ మోడల్లో భాగంగా పాకిస్థాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో టోర్నీ నిర్వహించేందుకు ప్రయత్నిస్తోంది. టీమ్ ఇండియా పాల్గొనే మ్యాచ్‌లను యూఏఈలో షెడ్యూల్ చేసే ప్లాన్‌లో ఉంది.
ఓ పక్క ఐసీసీ ప్రయత్నిస్తున్నా, మరోపక్క పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తన వైఖరిపై గట్టిగానే ఉన్నారు. మొత్తం టోర్నమెంట్ పాకిస్థాన్‌లోనే జరగాలని, హైబ్రిడ్ మోడల్‌కు అవకాశం లేదని తేల్చి చెప్పారు. మరింత ఆలస్యం చేయకుండా అధికారిక షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేయాలని కూడా కోరారు.
షెడ్యూల్ ఖరారు చేయడంలో జాప్యం -టోర్నమెంట్ షెడ్యూల్ మొదట నవంబర్ 12న రిలీజ్ చేస్తారని భావించారు. ఆ తర్వాత నవంబర్ 19కి వాయిదా వేశారు. ఇప్పటికీ బీసీసీఐ, పీసీబీ మధ్య విభేదాలు పరిష్కారం కాలేదు. సొంతంగా టోర్నీ నిర్వహించాలని పీసీబీ, పాక్‌లో అయితే అడుగు పెట్టమని బీసీసీఐ తేల్చి చెబుతున్నాయి.