Akash Chopra On Chahal Career : భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా బీసీసీఐ మేనేజ్మెంట్పై గంభీరమైన ఆరోపణలు చేశాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో మిస్టరీ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు చోటు దక్కకపోవడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. గతంలో అతడు మంచి ప్రదర్శనే చేసినా మేనేజ్మెంట్ చాహల్‌ను ఎందుకు పక్కన పెట్టిందో అర్థం అవ్వడం లేదని పేర్కొన్నాడు. బీసీసీఐ అతడి కెరీర్‌ను క్లోజ్ చేసిందని అన్నాడు. ఈ మేరకు ఆకాశ్ తన యూట్యూబ్ ఛానెల్లో తాజాగా వ్యాఖ్యానించాడు.
చాహల్ ఫైల్ క్లోజ్!
'యుజ్వేంద్ర చాహల్ కెరీర్ దాదాపు ముగిసిపోయింది. బీసీసీఐ అతడి ఫైల్‌ను క్లోజ్ చేసింది. అయితే ఇలా ఎందుకు జరిగిందనేది అర్థం చేసుకోవడం కూడా కష్టమే. 2023 జనవరిలో చాహల్ ఆఖరిసారిగా వన్డే మ్యాచ్ ఆడాడు. అప్పుడు అతడి గణాంకాలు ఆకట్టుకునేలాగే ఉన్నాయి. నిలకడగా వికెట్లు తీస్తూనే ఉన్నాడు. అయినా జట్టు నుంచి తప్పించారు. అతడు టీమ్‌కు దూరమై ఇప్పటికి దాదాపు రెండేళ్లవుతోంది. కానీ, అప్పట్నుంచి అతడికి అవకాశాలు మాత్రం ఇవ్వలేదు' అని ఆకాశ్ పేర్కొన్నాడు. కాగా, 2016లో చాహల్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 72 వన్డేల్లో 121, టీ20ల్లో 96 వికెట్లు పడగొట్టాడు.
Chahal IPL 2025 : 2025 ఐపీఎల్ మెగా వేలంలో మాత్రం చాహల్ భారీ ధరకు అమ్ముడయ్యాడు. ఈ లెగ్ స్పిన్నర్‌ను పంజాబ్ కింగ్స్ రూ.18 కోట్ల భారీ మొత్తానికి వేలంలో దక్కించుకుంది. 2013లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చాహల్ ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెండర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటివరకూ 160 మ్యాచ్‌ల్లో చాహల్ 205 వికెట్లు పడగొట్టాడు.
ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వీ జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.
'కొన్‌స్టాస్‌ను ఓసారి భారత్‌కు తీసుకురండి, చూపిద్దాం మనమేంటో!'- మాజీ క్రికెటర్
ముంబయితో రోహిత్, SRHతో భువీ జర్నీ ఓవర్?- ఇక ఫ్రాంచైజీ మారడం పక్కా! - Rohit Sharma Mumbai Indians