Brian Lara West Indies :గబ్బా వేదికపై సంచలన విజయం సాధించి చరిత్రకెక్కిన వెస్టిండీస్ జట్టుపై సర్వత్ర ప్రశంసల జల్లు కురుస్తోంది. సొంతగడ్డపై తమను ఓడించలేరంటూ ధీమాగా ఉన్న కంగారూలకు విండీస్ వీరులు చిత్తు చేసిన తీరు క్రికెట్ లవర్స్‌కు గూస్బంప్స్ తెప్పించింది. ఇక ఈ విజయంతో విండీస్ ప్లేయర్లు భావోద్వేగానికి లోనయ్యారు. స్టేడియంలో ఒకరినొకరు హత్తుకుని సంబరాలు చేసుకున్నారు.
మరోవైపు తాజాగా ఈ గెలుపును ప్రత్యక్షంగా చూసిన వెస్టిండీస్ మాజీ దిగ్గజం బ్రియాన్ లారా ఆనందంలో మునిగితేలిపోయారు. ఆ సంతోషాన్ని పట్టలేక కంటతడి పెట్టుకున్నారు. జట్టు గెలిచిన మరుక్షణమే పక్కనే ఉన్న ఆసీస్ మాజీ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ని కౌగిలించుకున్నారు. అంతే కాకుండా కన్నీళ్లు పెట్టుకుంటూనే కామెంట్రీ చేశారు. జట్టు సభ్యులను పొగడ్తలతో ముంచెత్తారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే - విండీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులకు ఆలౌట్ కాగా, ఆసీస్ 289/9 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. ఇక్కడే ఆసీస్ తీసుకున్న నిర్ణయం కాస్త బెడిసి కొట్టింది. అప్పటికి క్రీజ్‌లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (64*) అద్భుత ఆట తీరుతో ఉన్నాడు. చివరి వికెట్ కూడా పడే వరకూ మ్యాచ్‌ను తీసుకెళ్లి ఉంటే అదనంగా కొన్ని పరుగులు వచ్చుంటాయి. కానీ, రెండో ఇన్నింగ్స్‌లో విండీస్‌ను త్వరగా ఔట్ చేయాలనే ఉద్దేశం వల్ల ఆసీస్ ఈ నిర్ణయానికి వచ్చింది. అలా అనుకున్నట్లుగానే ప్రత్యర్థిని రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకు చిత్తు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 22 పరుగులతో కలిపి ఆసీస్‌కు విండీస్ 216 పరుగులను టార్గెట్‌గా ఉంచింది.