Border - Gavaskar Trophy 2024 : కీలకమైన బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ఇంకో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. మొదటి టెస్టుకు రోహిత్ శర్మ అందుబాటులో లేకపోయినా, తర్వాత సిరీస్‌లో జట్టుకు కెప్టెన్ వహించనున్నాడు. కోహ్లీ బ్యాటర్‌గా ఆరంభం నుంచి జట్టును ముందుకు నడిపించనున్నాడు. మరి ఈ స్టార్ దృఢంగా నిలబడి జట్టును నిలబెడతారా? వారి గణాంకాలు ఏం చెబుతున్నాయి? ప్రస్తుతం వారి ఫామ్ ఎలా ఉంది? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Kohli VS Australia : భారత బ్యాటర్లకు టఫ్ ఛాలెంజ్ విసిరే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పర్యటనల్లో మొదటి సారి ఇబ్బంది పడిన కోహ్లీ, తన రెండో సారి పర్యటనలో విశ్వరూపం చూపించి ప్రపంచ క్రికెట్ ఆశ్చర్యపోయేలా చేశాడు.
విరాట్, తన తొలి ఆస్ట్రేలియా పర్యటనలో 4 మ్యాచులు ఆడి 37.50 సగటుతో 300 పరుగులు సాధించాడు. ఓ ఆటగాడి కెరీర్ ఆరంభ దశలో ఇది మెరుగైన ప్రదర్శనే అని చెప్పాలి. 2014లో అతడు 4 మ్యాచ్‌ల్లో ఏకంగా 86.50 సగటుతో 692 పరుగులు ఖాతాలో వేసుకున్నాడు. అందులో శతకాలు ఉండటం విశేషం. అయినా సిరీస్‌లో ఓటమి ఎదురైంది.
కానీ 4 ఏళ్ల తర్వాత కోహ్లీ కెప్టెన్సీలో టీమ్ ఇండియా ఆస్ట్రేలియాలో తొలి సిరీస్ విజయం సాధించి సంచలనం సృష్టించింది. ఆ సిరీస్‌లో కోహ్లీ బ్యాటర్‌గానూ అద్భుతం చేశాడు. ఆ తర్వాతి సిరీస్‌లోనూ టీమ్ ఇండియా విజయం సాధించినప్పటికీ అందులో విరాట్ పాత్రేమీ లేదు. తొలి టెస్టులో ఓటమి అందుకున్న తర్వాత, అతడు కుటుంబ కారణాలతో సిరీస్‌కు దూరమయ్యాడు.
అయితే ఇప్పుడు విరాట్ కెప్టెన్‌గా కాకుండా, కేవలం బ్యాటర్‌గా ఆస్ట్రేలియా సిరీస్ ఆడబోతున్నాడు. అయితే ఇంతకముందు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన ప్రతీ సారి కోహ్లి బెస్ట్ ఫామ్‌తోనే వెళ్లాడు. కానీ ఇప్పుడు మాత్రం పేలవ ఫామ్‌తో వెళ్తున్నాడు. రీసెంట్గా న్యూజిలాండ్‌పై టీమ్ ఇండియా వైట్‌వాష్‌కు గురైన సిరీస్‌లో కోహ్లి 15.5 సగటుతో 93 పరుగులు మాత్రమే చేశాడు. పరుగులు చేయలేక ఇబ్బండి పడ్డాడు. దీంతో విరాట్ రిటైరైతే మంచిదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుత సిరీస్‌లో అతడు విఫలమైతే మాత్రం ఇబ్బందులు తప్పవు. తన కెరీర్‌ను తప్పక ముగించాల్సిన పరిస్థితి ఎదురవొచ్చు. ఆస్ట్రేలియాలో అయితే అతడికిది చివరి సిరీస్ అవ్వొచ్చు.
మొత్తంగా కోహ్లీ ఆస్ట్రేలియాపై 25 మ్యాచులు ఆడి 47.48 సగటుతో 2042 పరుగులు చేశాడు. అందులో అతడి అత్యధిక స్కోరు 186. వీటిలో 8 శతకాలు ఉన్నాయి. 5 అర్ధ శతకాలు ఉన్నాయి.
ఆస్ట్రేలియాలో 13 మ్యాచులు ఆడిన కోహ్లీ 54.08 సగటుతో 1352 పరుగులు సాధించాడు. ఇందులో అతడి అత్యధిక స్కోరు 169. మొత్తం 6 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు బాదాడు.