Aman Sehrawat Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా శుక్రవారం జరిగిన పురుషల రెజ్లింగ్ కాంస్య పోరులో 21 ఏళ్ల అమన్ సెహ్రావత్ అదరగొట్టాడు. 57 కిలోల విభాగంలో ప్యూర్టోరికోకు చెందిన దరియన్ టోయ్ క్రజ్ను 13-5తో ఓడించి చరిత్రకెక్కాడు.
ఆ రికార్డులో సింధును దాటి
ఒలింపిక్స్ బరిలో భారత్ తరఫున బరిలోకి దిగిన ఏకైక పురుష ప్లేయర్ అమన్. అయితే ఈ అబ్బాయి ఈ ఒలింపిక్స్‌లో మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒలింపిక్స్‌లో వ్యక్తిగత పతకం సాధించిన అతి పిన్న వయస్సు గల భారత అథ్లెట్‌గా రికార్డుకెక్కాడు. అయితే అమన్కంటే ముందే ఈ రికార్డును బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు తన ఖాతాలో వేసుకుంది. 2016లో జరిగిన ఒలింపిక్స్‌లో ఆమె రజతం గెలిచినప్పుడు తన వయసు 21 ఏళ్ల 1 నెల 14 రోజులు.
ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ ప్రస్థానం
ఒలింపిక్‌లో పతకం సాధించిన తొలి భారత రెజ్లర్ కేడీ జాధవ్. 1952 (హెల్సింకి)లో అతడు కాంస్యం గెలిచాడు. స్వతంత్ర భారతంలో ఒలింపిక్స్‌లో వ్యక్తిగత పతకం గెలిచిన తొలి ఆటగాడు కూడా ఆయనే. ఆ తర్వాత 2008 నుంచి రెజ్లింగ్‌లో క్రమం తప్పకుండా ఒక్క మెడలైనా సాధిస్తున్నారు మన రెజ్లర్లు. అయితే ఈ సారి ఆ రికార్డు చెరగనివ్వకుండా అమన్ కాపాడాడు. తన మెడల్‌తో ఆ క్రమాన్ని కొనసాగించినట్లు అయ్యింది. 2008లో సుశీల్ కుమార్ కాంస్యం ముద్దాడగా, ఆ తర్వాత 2012లో యోగేశ్వర్ దత్ (కాంస్యం), 2016లో సాక్షి మలిక్ (కాంస్యం) 2020లో రవి దహియా (రజతం),బజ్‌రంగ్ పునియా (కాంస్యం) సాధించారు. 2012లోనూ సుశీల్ కుమార్ రజత పతకాన్ని సాధించాడు.