What Is Thiruppavai :ధనుర్మాసంలో వైష్ణవ ఆలయాల్లో ప్రతి రోజూ తెల్లవారుఝామున తిరుప్పావై నిర్వహిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో కూడా ధనుర్మాసం 30 రోజులు సుప్రభాత సేవకు బదులు తిరుప్పావై నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అసలు తిరుప్పావై అంటే ఏమిటి? గోదాదేవి ఎవరు? 30 పాశురాలు విశిష్టత ఏమిటి? అనే అంశాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
తిరుప్పావై అంటే!
గోదాదేవిగా జన్మించిన ఆండాళ్ భగవంతుడినే భర్తగా భావించి, ఆయన్ను చేరుకోవడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై. 'తిరు'' అంటే శ్రీ అని, ''పావై'' అంటే పాటలు లేదా వ్రతం అని అర్ధం.
30 పాశురాల సమాహారం తిరుప్పావై
తిరుప్పావైలో 30 పాశురాలు ఉంటాయి. పాశురం అంటే ఛందోబద్ధంగా ఉన్న పాటలు. ఆండాళ్ అపురూప భక్తి పారవశ్యాన్నే శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్తమాల్యద అనే గ్రంథంగా అందించారు.
పాశురాలలో ఏముంటుంది?
గోదాదేవి రచించిన 30 పాశురాలు మంచి అలవాట్లతో జీవించమని, తోటివారికి సాయపడమని, భగవంతుని తప్పనిసరిగా ఆరాధించమని సూచిస్తాయి. ఒక్కో పాశురం ఒక్కొక్క రోజు చొప్పున 30 రోజులు గానం చేస్తారు. ఈ సందర్భంగా ఏయే పాశురాలలో ఏముంటుందో చూద్దాం.
మొదటి అయిదు పాశురాలు
మొదటి అయిదు పాశురాలలో ఉపోద్ఘాతం, తిరుప్పావై ముఖ్యోద్దేశ్యాన్ని తెలియజేస్తాయి. "చిత్తశుద్ధితో భగవంతుని ప్రార్థిస్తే వానలు కురుస్తాయి, పంటలు బాగా పండుతాయి, దేశం సుభిక్షంగా ఉంటుందన్న విషయాన్ని తెలియజేస్తాయి. అలాగే ఈ మాసంలో శ్రీకృష్ణుని పూలతో పూజిస్తే, పాపాలు నశిస్తాయని గోదాదేవి విన్నవిస్తుంది.
5 నుంచి 15 పాశురాల్లో
గోదాదేవి చెలులతో కలిసి వనంలో పూలు సేకరిస్తూ, పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి. పక్షుల కిలకిలారావాలు, రంగురంగుల పూలు, వెన్నను చిలకడంలోని సంగీత ధ్వనులు, ఆలమందల మెడలో చిరుగంటల సవ్వడి, దేవాలయంలో వినిపించే శంఖారావం వర్ణనలు ఉంటాయి. ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి, తన చెలులను తట్టి లేపుతూ, వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తూ విష్ణువు అవతారాలను పొగుడుతుంది.
15 నుంచి 20 పాశురాల్లో
గోదాదేవి తన చెలులతో కలిసి చేసిన దేవాలయ సందర్శనను వివరిస్తాయి. భగవంతుడిని నిద్ర మేల్కొలపడానికి ఆండాళ్ సుప్రభాతాన్ని ఆలపిస్తుంది. గోదాదేవి, ఆమె చెలులు దేవాలయ పరిరక్షకుల అనుమతి తీసుకుని గుడిలోకి వెళ్ళి శ్రీకృష్ణుడి తల్లిదండ్రులను కీర్తిస్తూ, బలరామకృష్ణులను మేల్కొపమంటూ వారిని వేడుకుంటారు. తర్వాత వారు కృష్ణుడి అష్ట మహిషుల్లో ఒకరైన నీలాదేవిని దర్శించి ప్రార్థిస్తారు.
20 నుంచి 30 పాశురాల్లో
చివరి తొమ్మిది పాశురాలు భగవంతుడి గొప్పతనాన్ని వివరిస్తాయి. ఆఖరి పాశురంలో గోదాదేవి, తను విష్ణుచిత్తుని కుమార్తెనని, ఈ 30 పాశురాలు తాను రచించి స్వయంగా పాడాననీ, ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో, వారికి భగవతుని కృప తప్పక కలిగి తీరుతుందని చెబుతుంది. ముఖ్యంగా వివాహం కావలసిన అమ్మాయిలు ఈ కీర్తనలు గానం చేస్తే తప్పకుండా కల్యాణ యోగం కలుగుతుందని తిరుప్పావై ఫలశృతిలో గోదాదేవి తెలియజేసింది.
ధనుర్మాసంలో తిరుప్పావై వ్రతం ఆచరించడం వీలు లేకపోతే, కనీసం ఆలయాల్లో జరిగే తిరుప్పావై ఉత్సవంలో పాల్గొనడం కూడా శుభప్రదమని శాస్త్రవచనం. శుభం భూయాత్!
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.