KTR ED Interrogation Completed : ఫార్ములా-ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ కార్యానిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణ ముగిసింది. సుమారు 7 గంటల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఉదయం 10.40 గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం 5.45 గంటలకు ముగిసింది.
ఈ నేపథ్యంలో ఈడీ కార్యాలయానికి బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. కొందరు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈడీ కార్యాలయం వద్దకు వచ్చిన ఎమ్మెల్యే గోపినాథ్, బాల్కసుమన్, ఆర్.ఎస్.ప్రవీణ్‌లను వెళ్లిపోవాలని ఆదేశించారు. ఈడీ ఆఫీసు వైపు వచ్చే వాహనాలను పోలీసులు దారి మళ్లించారు.
ఉదయం గచ్చిబౌలిలోని నివాసం నుంచి బయలుదేరి నేరుగా కేటీఆర్ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 200 మంది పోలీసులు అక్కడ మోహరించారు. బాష్పవాయువు, వాటర్ కెనాన్ల వాహనాలు తెప్పించారు.
వాస్తవానికి కేటీఆర్ ఈ నెల 7న ఆయన హాజరు కావాల్సి ఉన్నా, తాను రాలేనని కేటీఆర్ చెప్పడంతో 16న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఫార్ములా-ఈ రేస్‌లో నిబంధనల ఉల్లంఘనపై ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా, ఇందులో ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఈడీ మరో కేసు నమోదు చేసింది.
ఫార్ములా -ఈ కేసు వ్వవహరంలో ఎస్ నెక్ట్స్ కంపెనీకి ఏసీబీ నోటీసులు
'డిస్మస్డ్ యాజ్ విత్డ్రాన్గా' సుప్రీంకోర్టు ఉత్తర్వులు : దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఇదే కేసులో నిందితులుగా ఉన్న అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలను ఈడీ ఇప్పటికే విచారించింది. మరోవైపు ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఉన్నతన్యాయ స్థానం తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ కేటీఆర్ వేసిన పిటిషన్‌పై సైతం బుధవారం 'డిస్మిస్డ్ యాజ్ విత్‌డ్రాన్'గా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చిన నేపత్యంలో ఈడీ విచారణకు ప్రాధాన్యం సంతరించుకుంది.
నా ఆదేశాలతోనే నిధులు మంజూరు - ఏసీబీ విచారణలో కేటీఆర్ కీలక విషయాలు వెల్లడి