Thursday Remedies : తరచుగా చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడి ఇబ్బంది పడుతున్నవారు, వివాహం కుదిరినట్లే కుదిరి, ఆగిపోతున్నప్పుడు, ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వృత్తి పరమైన స్థిరత్వం లేకపోవడం, వ్యాపారంలో తరచుగా అడ్డంకులు ఎదుర్కొంటున్న వారు గురువారం కొన్ని పరిహారాలు చేయడం ద్వారా ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు. ఈ పరిహారాలేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
గురువారం కాదు బృహస్పతి వారం
హిందూ సంప్రదాయం ప్రకారం గురువారానికి అధిపతి బృహస్పతి. అదే విధంగా గురువారాన్ని లక్ష్మీవారమని కూడా అంటారు. వ్యాస మహర్షి రచించిన భవిష్యోత్తర పురాణం ప్రకారం గురువారం విష్ణువు, బృహస్పతి ఇద్దరినీ పూజిస్తే సుఖసంతోషాలు ఉంటాయని తెలుస్తోంది. అంతేకాదు గురువారం శ్రీ మహావిష్ణువును పూజిస్తే నారాయణుని వక్షస్థలంలో స్థిర నివాసమున్న శ్రీలక్ష్మీ దేవిని కూడా పూజించినట్లే అని శాస్త్రం చెబుతోంది.
గురుగ్రహ దోష ప్రభావం
వివాహం ఆలస్యం కావడం, కుదిరిన సంబంధాలు తప్పిపోవడం, వృత్తి పరమైన స్థిరత్వం లేకపోవడం, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలకు కారణం జాతకం ప్రకారం గురు గ్రహం బలహీనంగా ఉండడమే! ఇలాంటప్పుడు కొన్ని పరిహారాలు పాటించడం ద్వారా సమస్యల నుంచి బయటపడవచ్చు. ఆ పరిహారాలేమిటో చూద్దాం.
- గురువారం శ్రీ మహా విష్ణువును 108 తులసి దళాలతో అర్చిస్తే గురుగ్రహ దోషం పరిహారమవుతుంది.
- గురువారం రోజున 108 సార్లు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ నమః’ అనే మంత్రాన్ని జపించడం వలన శ్రీమన్నారాయణుని అనుగ్రహంతో వృత్తిలో స్థిరత్వం లభిస్తుంది.
- ముడి శెనగలు నీటిలో నానబెట్టి ఆ శెనగలు లక్ష్మీనారాయణులకు నైవేద్యంగా సమర్పించి అనంతరం వాటిని గోమాతకు తినిపించాలి. అలాగే నలుగురికి ప్రసాదంగా కూడా పంచి పెట్టాలి. ఇలా చేయడం వలన వివాహ సమస్యలు, దోషాలు తొలగిపోయి విష్ణుమూర్తి అనుగ్రహంతో శీఘ్రంగా వివాహం జరుగుతుంది.
- గురువారం విష్ణువు ఆలయానికి వెళ్లి పసుపు రంగు పువ్వులు, పసుపు రంగు ప్రసాదాలు నిమ్మకాయ పులిహోర, లడ్డు వంటివి సమర్పించడం వలన ఆర్థిక సమస్యలు దూరమవుతాయి.
- గురువారం రోజున రావి చెట్టు, అరటి చెట్టు, తులసిని పూజించడం వల్ల విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహంతో చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి.
- గురువారం పాటించే ఈ పరిహారాలతో లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో సమస్యలు తొలగిపోయి సకల శుభాలు చేకూరుతాయి.
జై శ్రీమన్నారాయణ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.