Maha Kumbh 2025 Highlights : మహాకుంభమేళా ప్రయాగ్‌రాజ్‌కు ఒక వరంలా మారింది. ఈ ఆధ్యాత్మిక క్రతువు కోసం ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ప్రయాగ్‌రాజ్‌లో భారీగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది. రోడ్లు, పార్కులు, మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలు, ఆధునాతన సీసీటీవీ కెమెరాలు ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ప్రయాగ్‌రాజ‌్‌ను స్మార్ట్ సిటీగా యూపీ ప్రభుత్వం తీర్చిదిద్దింది. ఈసారి దాదాపు 40 కోట్ల మంది వస్తారని అంచనా వేసిన యూపీ సర్కారు కుంభమేళా నిర్వహణ కోసం ఏకంగా రూ.7వేల కోట్ల బడ్జెట్‌తో ఏర్పాట్లు చేసింది.
ప్రయాగ్‌రాజ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా కోట్లాది మంది భక్తులను ఆకర్షించడమే కాదు, భారీస్థాయిలో మౌలిక సదుపాయల అభివృద్ధికి నాంది పలికింది. ఒకప్పుడు అరకొర సౌకర్యాలతో తీవ్ర ఇబ్బందులు పడిన ప్రయాగ్‌రాజ్ నివాసితులకు మహాకుంభమేళా నిర్వహణతో శాశ్వత పరిష్కారం దొరికింది. కుంభమేళా నిర్వహణ కోసం ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం నగరంలో భారీగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది. ఇందుకోసం ఏకంగా 549 ప్రాజెక్ట్‌లు చేపట్టింది.
రోడ్లు అభివృద్ధి
కుంభమేళా కోసం నగరంలో ప్రధానంగా రోడ్లను అభివృద్ధి చేశారు. ట్రాఫిక్‌ను నివారించడానికి కొత్త ఫ్లైఓవర్‌లను నిర్మించారు. రహదారుల పక్కన ఉన్న ఆక్రమణలను తొలగించి రోడ్లను విస్తరించారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి నగరంలో పెద్దసంఖ్యలో కూడలిలు ఏర్పాటు చేశారు. అంతేకాదు మేరఠ్, ప్రయాగ్‌రాజ్‌ను కలిపే 594 కిలోమీటర్ల పొడవైన గంగా ఎక్స్‌ప్రెస్ వేను ఆరు లైన్ల నుంచి 8 లైన్లకు విస్తరించారు. గతంలో మూడు రైల్వే స్టేషన్ల మాత్రమే ఉండేవి. ఇప్పడు వాటిని ఎనిమిదికి పెంచారు.
మంచి నీటి సౌకర్యాలు
ఈ కుంభమేళాలో నివాసితులకు, సందర్శకులకు పరిశుద్ధమైన నీరు, మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలు అందించడంపై యూపీ సర్కారు ప్రధానంగా దృష్టి పెట్టింది. నగరమంతటా సురక్షితమైన తాగునీరు కోసం ఆధునాతన 'వాటర్ ఏటీఎం'లను ఏర్పాటు చేశారు. ఒక లక్షా యాభై వేలకు పైగా ఆధునిక తాత్కాలిక మరుగుదొడ్లును ఏర్పాటు చేశారు. వీటికి అనుబంధంగా మొబైల్ పారిశుద్ధ్య యూనిట్లను అందుబాటులో ఉంచారు. ప్రస్తుతానికి 80 నుంచి 90 శాతం మురుగునీరు శుద్ధి సౌకర్యాలు ఏర్పాటు పూర్తి అయిందని, వీటి కారణంగా గంగానదిలోకి మురుగునీరు ప్రవహించడం ఆగిపోతుందని అంచనా వేస్తున్నారు.
వసతి సౌకర్యాలు
కుంభమేళాకు వచ్చే భక్తుల కోసం వసతి కల్పించడానికి తాత్కాలిక, శాశ్వత గృహాల నిర్మాణంలో ప్రభుత్వం గణనీయమైన పెట్టుబడులు పెట్టింది. 4 వేల హెక్టార్ల విస్తీర్ణంలో భారీ టెంట్ సిటీని నిర్మించారు. ఇందులో విద్యుత్, నీరు, మార్కెట్లు వంటి ముఖ్యమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఉన్న హోటళ్లు, ఆశ్రమాలు, అతిథి గృహాలను అప్‌గ్రేడ్ చేశారు. స్మార్ట్ సిటీ టెక్నాలజీని కూడా అభివృద్ధి చేశారు. నగరమంతటా ఎల్ఈడీ లైట్లతో అలకరించారు. దాదాపు 2,700కు పైగా ఏఐ ఆధారిత సీసీటీవీ కెమెరాల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. నగరంలో ఉద్యానవనాలు, గ్రీన్ బెల్ట్‌లు అభివృద్ధి చేయడం వల్ల గాలి నాణ్యత మెరుగుదలపై దృష్టి సారించారు.
వైద్య సదుపాయాలు
కుంభమేళా కోసం సమగ్ర ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. మహాకుంభమేళా సమయంలో వైద్య అత్యవసర పరిస్థితులను నిర్వహించడానికి 11 తాత్కాలిక ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. అధునాతన లైఫ్-సపోర్ట్ వ్యవస్థలతో కూడిన బలమైన అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచారు. ప్రయాగ్‌రాజ్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి గణనీయమైన ఆర్థిక, సామాజిక ప్రయోజనాలను తెచ్చిపెట్టింది. నిర్మాణం, పారిశుద్ధ్యం, రవాణా, అతిథ్య రంగాలలో వేలాది ఉద్యోగాలు లభించాయి.
మహా కుంభమేళాలో తెలుగు ప్రజలు- రామోజీరావును తలుచుకుని ఎమోషనల్!
కాసులు కురిపించే కుంభమేళా- ఉత్తర్‌ప్రదేశ్‌కు రూ.2 లక్షల కోట్లు ఆదాయం! ఒక శాతం పెరగనున్న GSDP!