Indiramma House Model : నిరుపేదలకు ఆవాస సదుపాయం కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 'ఇందిరమ్మ' పేరిట ఇళ్లు నిర్మించనున్న విషయం తెలిసిందే. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం ఇంటింటి సర్వే నిర్వహిస్తోంది. పథకం లబ్ధిదారులు అందుబాటులో ఉన్న స్థలంలోనే రూ.5 లక్షలతో అందంగా ఎలా ఇంటిని కట్టుకోవాలో అధికారులు సుదీర్ఘ కసరత్తు చేశారు. ఇందుకు సంబంధించి 2 నమూనాలు రూపొందించారు. ఆయా నమూనాల్లో ఇళ్లను నిర్మించుకునేందుకు వీలుగా లబ్ధిదారులకు అవగాహన కోసం అక్కడక్కడ ఓ మోడల్ గృహం నిర్మిస్తున్నారు. ఈ పద్ధతుల్లో ఇంటి పనులు చేపడితే రూ.5 లక్షలతోనే పూర్తి చేయొచ్చునని అధికారులు చెబుతున్నారు. మోడల్ నిర్మాణాల కోసం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా స్థలాలను ఇప్పటికే ఎంపిక చేశారు. ఎంపీడీవో కార్యాలయంలో వీటిని నిర్మించాల్సి ఉండగా, స్థలాభావం వల్ల కొన్ని చోట్ల తహసీల్దార్ కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తున్నారు.
- చింతకాని మండల పరిషత్తు కార్యాలయంలో స్థలం లేకపోవటంతో ఎమ్మార్వో ఆఫీస్ ఆవరణలో నమూనా ఇంటి నిర్మాణం చేపట్టారు.
- మధిర, కూసుమంచి, ఖమ్మం అర్బన్, వైరా, రఘునాథపాలెం, తిరుమలాయపాలెం, సత్తుపల్లి, కల్లూరు, ముదిగొండలో నమూనా గృహ నిర్మాణం వేగవంతంగా సాగుతోంది.
- కూసుమంచిలో ఇంటి నమూనా పూర్తయింది.
నమూనా 1 : -
తెలంగాణ హౌసింగ్ బోర్డు సూచన మేరకు ఇంటికి ముందు 9.0×10.0 హాలు, ఆగ్నేయంలో 6.9×10.0 వంట గది, 12.5×10.5 సైజులో బెడ్‌రూం, అందులోనే అటాచ్డ్ బాత్‌రూం, వాష్ ఏరియాతో కలిపి నిర్మాణం చేపట్టనున్నారు. మొత్తం అయిదు తలుపులు (3 పెద్దవి, 2 చిన్నవి), 4 కిటికీలు (3 పెద్దవి, 1 చిన్నది), 2 వెంటిలేటర్లు ఉంటాయి. అవసరం అయితే మెట్ల నిర్మాణం కూడా చేపట్టుకోవచ్చు.
నమూనా 2 : -
30.11×14.0 చదరపు అడుగుల స్థలంలో నిర్మించే ఇంటి ముందు భాగంలో 7.1×4.5 సైజులో సిటవుట్, ఆగ్నేయంలో 8.0×6.9 వంటగది, 12.6×11.0 హాల్, 9.2×11.0 హాల్‌తో అటాచ్డ్ బాత్‌రూం, వాష్ ఏరియా ఉండేలా నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ఇంటి నిర్మాణంలో పెద్దవి, చిన్నవి కలిపి మొత్తం 6 తలుపులు, 4 కిటికీలు, 2 వెంటిలేటర్లు ఉంటాయి.
ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 3,57,869 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటికి సంబంధించి ఇప్పటికే 92.11 శాతం సర్వే పూర్తయింది.
రూ.5 లక్షల్లో ఇంటి నిర్మాణం : జిల్లాలోని 21 మండలాల్లో ఇంటి నమూనా నిర్మాణాలకు సంబంధించి స్థలాల ఎంపిక పూర్తయిందని హౌసింగ్ పీడీ బి.శ్రీనివాస్ తెలిపారు. లబ్ధిదారులు స్థానిక వనరులను ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నమూనాలో నిర్మాణం చేపడితే రూ.5 లక్షల్లో పనులు పూర్తవుతాయని భరోసా ఇచ్చారు.
ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ - హైదరాబాద్‌లో వారికే తొలి ప్రాధాన్యం : మంత్రి పొన్నం
ఇందిరమ్మ ఇళ్లపై ఫిర్యాదులా? - ఈ వెబ్సైట్లో ఫిర్యాదు చేసేయండి