HRA Vs Tax Exemption : సాధారణంగా కంపెనీలు తమ ఉద్యోగులకు ప్రతినెలా వేతనంతో పాటు ఇంటి అద్దె భత్యాన్ని(HRA) చెల్లిస్తుంటాయి. మీరు అద్దె ఇంట్లో ఉంటున్నా వేతనంతో పాటు హెచ్‌ఆర్ఏ రావడం లేదా? అయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ మీరు ఆదాయపు పన్ను(ఐటీ) చట్టంలోని 80జీజీ సెక్షన్ కింద పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. హెచ్‌ఆర్ఏ ప్రయోజనం పొందని వేతన జీవులతో పాటు స్వయం ఉపాధి పనులు చేసుకునేవారు ఈ పద్ధతిలో పన్ను మినహాయింపును పొందొచ్చు. ఎంతమేర పన్ను మినహాయింపు ఇవ్వాలనేది మీ వార్షిక వేతనం, ఇంటి అద్దెల ఆధారంగా నిర్ణయిస్తారు. ఐటీ చట్టంలోని 80జీజీ సెక్షన్ కింద పన్ను మినహాయింపు పొందే పద్ధతి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
సెక్షన్ 80జీజీ కింద పన్ను మినహాయింపునకు అర్హతలివీ
ఐటీ చట్టంలోని సెక్షన్ 80జీజీ కింద పన్ను మినహాయింపు పొందాలంటే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెలవారీ వేతనంతో పాటు ఇంటి అద్దె భత్యం(HRA) లభించని ఉద్యోగులు మాత్రమే ఈ క్లెయిమ్ చేసుకోవడానికి అర్హులు. అద్దె ఇంట్లో ఉండేవారికే ఈ క్లెయిమ్ చేసుకునే అర్హత ఉంటుంది. ఆఫీసు అద్దెలు, భవనాల అద్దెలు వంటివి దీని కింద క్లెయిమ్ చేసుకోలేం. మీరు నివసిస్తున్న నగరంలో మీ పేరుతో కానీ, మీ జీవిత భాగస్వామి పేరుతో కానీ, పిల్లల పేర్లతో కానీ స్థిరాస్తులు ఉండకూడదు.
క్లెయిమ్ చేసుకోవడం ఇలా!
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80జీజీ కింద పన్ను మినహాయింపు కావాలంటే ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తును సమర్పించాలి. ఇందులో భాగంగా ఫామ్ 10BAను నింపి సబ్మిట్ చేయాలి. సెక్షన్ 80జీజీ కింద పన్ను మినహాయింపు పొందే అర్హతలన్నీ ఉన్నాయని ఆ ఫామ్‌లో మీరు స్వీయ ధ్రువీకరణ చేయాలి. ఫామ్‌లో సమర్పించిన సమాచారమంతా సరైనదే అని డిక్లరేషన్ ఇవ్వాలి. వీటితో పాటు ఇంటి అద్దెల రసీదులు, ఇంటి అద్దె ఒప్పంద పత్రాలు, బ్యాంకు స్టేట్‌మెంట్లను సమర్పించాల్సి ఉంటుంది.
పన్ను మినహాయింపు ఎంత లభిస్తుంది?
మీకు అన్ని అర్హతలు ఉంటే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80జీజీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనం దక్కుతుంది. మీకు ప్రతినెలా రూ.5వేలు చొప్పున లేదా సంవత్సరానికి రూ.60వేల దాకా పన్ను మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది. మీకు ప్రతి సంవత్సరం వచ్చే అడ్జస్టెడ్ స్థూల ఆదాయం (ఏజీఐ)లో 25 శాతం దాకా పన్ను మినహాయింపు దక్కుతుంది. మీ ఏజీఐలో 10 శాతం భాగాన్ని వార్షిక ఇంటి అద్దెగా ఆదాయపు పన్ను విభాగం పరిగణిస్తుంది. మొత్తం మీద మీకు ఒక సంవత్సరానికి రూ.60వేలకు మించి పన్ను మినహాయింపు లభించదు.