Mukkanuma Festival 2025 : సంక్రాంతి అంటే నాలుగు రోజుల పండుగ. ఇందులో తొలి మూడు రోజులకు ఏదో ఒక పరమార్థం ఉంది. కానీ నాలుగో రోజున ఫలానా విధులు నిర్వహించాలి అంటూ ఎక్కడా కనిపించదు. ముక్కనుమ ఓ పండుగలా కాకుండా సంక్రాంతి సంబరాలకు ముగింపులా తోస్తుంది. ఈ సందర్భంగా ముక్కనుమ విశిష్టత ఏంటి? ఈ పండుగ ఎలా జరుపుకోవాలి అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
సంక్రాంతి పండుగకు ముగింపు
కనుమ మరుసటి రోజు ముక్కనుమగా వ్యవహరిస్తారు. ఏడాది మొత్తం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసే సంక్రాంతి వేడుకలకు ముగింపు పలికేది ముక్కనుమ పండుగ. ఈ రోజున ఎవరైతే ఆనవాయితీ ప్రకారం భోగి నాడు గౌరీ దేవి రూపంలో గొబ్బెమ్మను పెట్టుకుంటారో- వారు తమ సమీపంలోని నదులు, చెరువుల వద్దకు వెళ్లి, గొబ్బెమ్మలను నిమజ్జనం చేసి, అక్కడే బంధు మిత్రులతో కలిసి గొబ్బెమ్మకు నైవేద్యం పెట్టిన వంటకాలను భుజిస్తారు. పెద్దలు పిల్లలు భేదం లేకుండా అక్కడే అందరూ కలిసి గాలిపటాలు ఎగుర వేస్తారు.
గ్రామదేవతల పండుగ
సంక్రాంతిలో తొలి రోజైన భోగిన కీడు పోగొట్టే పండుగగానూ, రెండో రోజైన సంక్రాంతిని పెద్దల పండుగగానూ, మూడోరోజైన కనుమను పశువుల పండుగగానూ చేసుకునే జనం నాలుగో రోజున గ్రామదేవతలను తల్చుకుంటూ మాంసాహారాన్ని వండుకునే సంప్రదాయం కనిపిస్తుంది. అందుకనే ముక్కనుమను ముక్కల పండుగగా వ్యవహరిస్తారు.
ఆడపడుచులకు వీడ్కోలు
సంక్రాంతిలో మూడోరోజైన కనుమనాడు పొలిమేర దాటకూడదన్న నియమం ఉంది. పండగకు ఇంటికి వచ్చిన ఆడపడుచులను సత్కరించుకుని, మనసారా కానుకలు ఇచ్చుకుని ముక్కనుమ నాడు వీడ్కోలు పలుకుతారు. కొంతమంది ముక్కనుమను కూడా పండుగగా భావించి, ఆరోజు కూడా బయల్దేరకూడదని చెబుతుంటారు. కానీ ఈ విషయమై శాస్త్రపరంగా ఎలాంటి నియమం లేదు.
సావిత్రి గౌరీ వ్రతం
ముక్కనుమ రోజున కొత్తగా పెళ్లైన నూతన వధువులు 'సావిత్రి గౌరీవ్రతం' అనే వ్రతాన్ని పట్టడం కూడా కనిపిస్తుంది. ఇందుకోసం మట్టి ప్రతిమలను ప్రతిష్టించుకుని, వాటికి తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాల పిండి వంటలు నివేదనం చేస్తారు. చివరకు ఆ బొమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు. బొమ్మలతో చేసే వ్రతం కాబట్టి దీనిని బొమ్మల నోము అని కూడా పిలుస్తారు.
బంధుమిత్రుల కలయిక
ముక్కనుమ రోజు చుట్టాలను, బంధువులను కలుసుకుంటే మంచిదని చెబుతారు. ఒక రకంగా బంధుత్వాలను కలుపుకునేందుకు, సంబంధీకుల మంచిచెడులను పరామర్శించేందుకు ఈ రోజున ప్రాముఖ్యం ఇస్తారన్నమాట. అంతేకాదు, ఈ రోజున కుటుంబ సమేతంగా వనభోజనాలకు వెళ్లే ఆనవాయితీ కూడా ఉంది.
భోగించుకోవడమే కాదు భాగించుకోవడం
సిరిసంపదలు తాము భోగించుకోవడమే కాకుండా భాగించుకోవడం- అంటే అందరితో కలిసి పంచుకోవాలన్నదే ఈ సంక్రాంతి పండుగ ఉదేశం.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.