తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

కార్తిక శనివారం "వేంకటేశ్వర శంఖుచక్రదీపం" వెలిగిస్తే చాలు - కలి దోషాలు, పీడలు, బాధలన్నీ ఇట్టే తొలగిపోతాయట! - VENKATESWARA SHANKU CHAKRA DEEPAM

కలి బాధలన్నీ పోగొట్టే వేంకటేశ్వర శంఖుచక్రదీపం - కార్తికంలో ఈ రోజు వెలిగిస్తే విశేషమైన ఫలితాలు!

Shanku Chakra Deepam in Karthika Masam
Karthika Masam (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 15, 2024, 10:52 AM IST

How to Light Shanku Chakra Deepam in Karthika Masam :ప్రస్తుతం మాసాలన్నింటిలోకెల్లా పరమపావనమైన కార్తిక మాసం నడుస్తోంది. ఈ మాసంలో స్నానం, దీపం, దానం, అభిషేకం, ఉపవాసం వంటివి విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. ఈ క్రమంలోనే దాదాపు అందరూ ఎక్కువగా దీపారాధన, ప్రత్యేకమైన పూజలు చేస్తుంటారు. ఇక ఈ మాసంలో వచ్చే ఒక్కో వారానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వరస్వామి అనుగ్రహం పొంది కలి బాధలు, పీడలు, దోషాలన్ని తొలగిపోవాలంటే.. వేంకటేశ్వర శంఖుచక్ర దీపాన్ని వెలిగించాలంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్. మరి, ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి? ఏ రోజు వెలిగిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కార్తిక మాసం.. దీపారాధనకు విశిష్టమైనది. అందులో భాగంగా పరమ పవిత్రంగా భావించే ఈ మాసంలో కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే వేంకటేశ్వరస్వామి అనుగ్రహం పొంది.. కలి బాధలన్నీ పోవాలంటే వేంకటేశ్వర శంఖుచక్రదీపం వెలిగించాలంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్. ఈ మాసంలో ఇంట్లో ఏ రోజైనా సరే లేదంటే ప్రత్యేకంగా శనివారం ఈ దీపాన్ని వెలిగిస్తే ఇంకా విశేషమైన ఫలితాలు ఉంటాయంటున్నారు. ముఖ్యంగా వేంకటేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహం లభించి కలి బాధలు, పీడలు, దోషాలన్నీ తొలగిపోతాయంటున్నారు.

ఈ దీపాన్ని ఎలా వెలిగించాలంటే?

  • ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తలస్నానం చేసి పూజ గదిని అలంకరించుకోవాలి.
  • ఆ తర్వాత పూజామందిరంలో ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని శుభ్రమైన క్లాత్​తో తుడిచి కుంకుమ, గంధం బొట్లు పెట్టుకోవాలి.
  • అనంతరం ఆ చిత్రపటం ఎదురుగా పీట వేసి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి.
  • ఆపై ఆ పీట మీద బియ్యప్పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. ఎందుకంటే శ్రీనివాసుడికి ఆ ముగ్గు అంటే చాలా ఇష్టం. ఆవిధంగా ముగ్గు వేసిన తర్వాత దాని మీద రెండు ఇత్తడి లేదా మట్టి ప్రమిదలను ఏర్పాటు చేసుకోవాలి.
  • తర్వాత వాటికి చక్కగా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అనంతరం ఆ ప్రమిదల్లో పిండి దీపాలను ఏర్పాటు చేసుకోవాలి. అంతకంటే ముందు ఈ పిండి దీపాలను తడి గంధంతో వేంకటేశ్వర స్వామి నిలువు నామంతో చక్కగా అలంకరించుకోవాలి.
  • ఇప్పుడు ఆ పిండి దీపాల్లో ఆవు నెయ్యిని పోయాలి. ఆపై అందులో ఆవు నెయ్యిలో తడిపిన రెండు కుంభ వత్తులను ఉంచి దీపాలను వెలిగించాలి. అలా వెలిగించాక ఆ పిండి దీపాలకు లోహంతో తయారు చేసిన చిన్న చక్రం, శంఖువుతో అలంకరణ చేసుకోవాలి.
  • లేదంటే.. దీపాలు వెలిగించడానికి ముందైనా సరే ఏదైనా లోహంతో చేసిన చిన్న చక్రం, శంఖువుతో అలంకరణ చేసుకోవాలి. ఇవి బయట పూజా స్టోర్​లలో అందుబాటులో ఉంటాయి. ఇలా ప్రత్యేక అలంకరణ చేసుకుని దీపాలనువెలిగించడాన్ని "వేంకటేశ్వర శంఖుచక్రదీపం"గా పిలుస్తారు.
  • కార్తికమాసంలో ఏరోజైనా సరే, మరి ముఖ్యంగా కార్తిక శనివారం ఇలా వేంకటేశ్వర శంఖుచక్రదీపాన్ని వెలిగిస్తే శ్రీవారి సంపూర్ణమైన అనుగ్రహం పొందడమే కాకుండా.. కలి బాధలు, పీడలు, దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్.

ముఖ్యగమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఇవీ చదవండి :

కార్తిక మాసంలో అరుణాచల 'అగ్ని లింగ' దర్శనం- సకల పాప హరణం- గిరి ప్రదక్షిణ నియమాలివే!

'అప్పుల బాధలు తీరట్లేదా? - కార్తిక మాసంలో "కందుల దీపం" వెలిగిస్తే విశేష ఫలితం!'

ABOUT THE AUTHOR

...view details