Bali Chakravarthi Story :హిందూ ధర్మశాస్త్రం కలియుగంలో నామ స్మరణకు ఎంత ప్రాముఖ్యం ఉందో అంతకు పదిరెట్లు దానం వల్ల కలుగుతుందని చెబుతోంది. 'పంచుకో పెంచుకో' సిద్ధాంతాన్ని పాటించడం వల్ల ఆధ్యాత్మిక శాంతి దొరుకుతుంది. అంటే మన దగ్గర ఉన్నదాన్ని నలుగురితో పంచుకుంటే సంపద మరింత పెరుగుతుందని అర్ధం. ఈ కథనంలో దానం ఎంత గొప్పదో తెలుసుకునే ఒక పౌరాణిక ఇతివృత్తం గురించి తెలుసుకుందాం.
దానం విశిష్టత
కుడిచేత్తో చేసిన దానం ఎడమ చేతికి కూడా తెలియకూడదని పెద్దలు అంటారు. అంటే చేసిన దానం గురించి ఎప్పుడు గొప్పలు చెప్పుకోకూడదు. చేసిన దానం మర్చిపోవాలి. పొందిన మేలును జీవితాంతం గుర్తుంచుకోవాలి. దానం చేయాలని మనలో ఏ కొద్ది మందికో ఉంటుంది. చాలా మందికి దానం చెయ్యడం వల్ల వచ్చే ఫలితం తెలియక దానధర్మాలు చేయకుండా జీవితం సాగిస్తుంటారు. మన పురాణాలు చేసిన ధర్మం వల్లే మనకు కామితార్ధాలు అన్నీ సమకూరుతాయని తెలియజేస్తోంది.
బలి చక్రవర్తి
బలి చక్రవర్తి గురించి ఎంతటి గొప్ప ధనవంతుడో అందరికీ తెలుసు. తన ప్రాణాలకే ప్రమాదం అని తెలిసి కూడా బలి చక్రవర్తి సాక్షాత్ శ్రీమహావిష్ణువుకే మూడు అడుగుల భూమిని దానం చేసి మహనీయుడిగా, గొప్ప దాతగా చరిత్రలో నిలిచిపోయాడు. అతనికి అంతటి గొప్ప అవకాశం రావటానికి కారణం తను గత జన్మలో చేసుకొన్న పుణ్యమే.
బలి చక్రవర్తి గత జన్మ వృత్తాంతం
బలి గత జన్మలో ఒక దరిద్రుడు. అంతేకాదు దేవునిపై నమ్మకం లేకుండా నాస్తికునిలా వేద పండితులనూ దేవతలనూ నిత్యం దూషిస్తూ తిరుగుతుండేవాడు. అతను దరిద్రుడే అయినా వేశ్యా లోలుడు. ఒక సారి వేశ్యా సంగమానికి సిద్ధమై ఎలాగో తను సంపాదించిన తాంబూలం, సుగంధ ద్రవ్యాలూ, శ్రీ చందనం, కర్పూరం, మల్లె పూలూ ఇత్యాది భోగ వస్తువులను ఒక సంచీలో పెట్టుకొని వేశ్యా వాటికకి బయల్దేరాడు.
అపస్మారక స్థితిలో శివార్పణం చేస్తున్న ఊహ
వేశ్యా వాటికకు బయల్దేరిన అతను మార్గమధ్యంలో కాలుజారి నేల మీద పడ్డాడు. అలా పడేటప్పుడు తన తలకి బలంగా గాయమై మూర్చపోయాడు. ఆ సమయంలో అతనికి ఒక విచిత్రమైన ఊహ కలిగింది. తన దగ్గరున్న ఈ పరిమళ ద్రవ్యాలన్నీ శివుడికి నివేదన చేస్తున్నట్టు. ఆ ఊహలో ఉండగానే అతను ప్రాణాలు విడిచాడు. తన దగరున్న సర్వస్వాన్నీ భగవంతుడికి ఊహా మాత్రంగా నివేదించిన పుణ్యఫలానికి ఆ పరమేశ్వరుడి దయవల్ల అతనికి గొప్ప పుణ్యఫలం లభించింది.
శివార్పణ ఊహతో గర్భ దరిద్రునికి ఇంద్రపదవి
మరణించిన వారిని యమభటులు నరకానికి తీసుకుపోయారు. అక్కడ యముడు అతని పాప పుణ్యాలని విచారించగా అతనికి చేసిన పాపాలకిగానూ ఘోరమైన నరక శిక్షలు విధించాల్సి ఉందని చిత్రగుప్తుడు చెప్పాడు. కానీ అతడు తన చివరి ఘడియలలో తన దగ్గరున్న యావత్తూ ఆ పరమేశ్వరుడికి నివేదిస్తున్నట్టు భావించినందుకు మూడు ఘడియల పాటు ఇంద్ర పదవిని చేపట్టాల్సి ఉందని, అలా మూడు ఘడియలు పూర్తయ్యాక అతడ్ని నరకంలో శిక్షించవచ్చని చెప్పాడు.