KTR Files Petition in Supreme Court : ఫార్ములా ఈ-కారు రేసు వ్యవహారంలో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇవాళ రాష్ట్ర హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఆయన భవిష్యత్ వ్యూహంపై న్యాయనిపుణులు, పార్టీ నేతలతో చర్చించారు. అనంతరం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ తరఫున న్యాయవాది మోహిత్‌రావు సాయంత్రం 4.40 గంటలకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో పిటిషన్ వేశారు.
నేతలతో మంతనాలు : కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళతారని మధ్యాహ్నమే వార్తలు వచ్చాయి. హైకోర్టు తీర్పు వచ్చిన తరువాత పలువురు బీఆర్ఎస్ నేతలు జూబ్లీహిల్స్ నందినగర్‌లోని కేటీఆర్ నివాసానికి వెళ్లారు. సాయంత్రం కేటీఆర్ తల్లి శోభ కూడా వచ్చారు.
అప్రమత్తమైన ప్రభుత్వం : సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ కంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఆయన సుప్రీంకు వెళ్తారని మధ్యాహ్నమే వార్తలు రావడంతో వెంటనే కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనను కూడా వినాలని ముందస్తుగానే పిటిషన్ వేసింది.
కేటీఆర్ పిటిషన్ వేస్తే మా వాదనలూ వినండి - సుప్రీంకోర్టులో ప్రభుత్వం కేవియట్
ఇవాళ ఉదయం హైకోర్టు తీర్పులో కేటీఆర్ ఎలాంటి ఉపశమనం లభించలేదు. క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయడమే కాకుండా అరెస్ట్ చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సైతం ఉపసంహరించింది. ఏసీబీ అరెస్ట్ చేయకుండా 10 రోజుల పాటు మధ్యంతర ఉత్తర్వులు పొడిగించాలని కేటీఆర్ లాయర్ చేసిన విజ్ఞప్తిని కూడా ధర్మాసనం తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే ఆయన సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. పిటిషన్ రేపు సుప్రీం ముందుకు విచారణకు రానుంది.
మరోసారి ఈడీ నోటీసులు : హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈడీ కూడా తమ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో విచారణకు రావాలని ఈడీ మధ్యాహ్నం మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 16న తమ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొంది. అటు ఏసీబీ నిన్న రాత్రే కేటీఆర్‌కు నోటీసులు పంపింది. ఈనెల 9న విచారణకు రావాలని సూచించింది.
రేపు చాలా కీలకం : మరోవైపు ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏ2గా అప్పటి మున్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ రేపు ఏసీబీ ముందు హాజరుకానున్నారు. అలాగే ఇదే కేసులో ఏ3గా హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బిఎల్‌ఎన్ రెడ్డి రేపు ఈడీ ముందు హాజరుకానున్నారు.
కేటీఆర్‌కు మరోసారి ఈడీ నోటీసులు - ఈనెల 16 న విచారణకు రావాలని ఆదేశం