TGPSC Released Group-3 Exam Key : గ్రూప్-3 పరీక్ష ప్రాథమిక కీ ని టీజీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లలో ప్రాథమిక కీ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈనెల జనవరి 12 వరకు గ్రూప్ 3 ప్రాథమిక కీ అందుబాటులో ఉండనున్నట్లు టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. ఏవైనా సందేహాలు ఉంటే ఈనెల 12న సాయంత్రం 5 వరకు స్వీకరిస్తామని పేర్కొంది.
అభ్యంతరాలను ఇంగ్లీష్‌లో తెలపాలని, అభ్యర్థులు లేవనెత్తిన అంశాలకు సంబంధించిన ఆధారాల కాపీలను ఆన్‌లైన్‌లోనే పంపాలని సూచించారు. ఈ-మెయిల్, వ్యక్తిగతంగా వెళ్లి సమర్పించడాన్ని ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని కమిషన్ స్పష్టంచేసింది. గ్రూప్-3 పరీక్షలను టీజీపీఎస్సీ 2024 నవంబర్ 17, 18వ తేదీల్లో నిర్వహించింది. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5.36లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 2,69,483 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు.
గ్రూప్-3 ప్రిలిమినరీ కీతో పాటు టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ ఫలితాలను కూడా టీజీపీఎస్సీ విడుదల చేసింది. 2023 జులైలో నిర్వహించిన పరీక్షకు సంబంధించి ఎంపికైన 171 మంది అభ్యర్థుల జాబితా విడుదల ప్రకటించింది. మరో రెండ్రోజుల్లో గ్రూప్-2 పరీక్ష ప్రాథమిక 'కీ' విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశామని కూడా కమిషన్ వెల్లడించింది. టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం మీడియాతో చిట్‌చాట్‌లో ఈ విషయాలను ప్రకటించారు.
ప్రభుత్వం సహకరిస్తే షెడ్యూల్ సిద్ధం చేస్తాం : షెడ్యూల్ ప్రకారం ఫలితాలు వచ్చేలా పనిచేస్తున్నామని, టైం షెడ్యూల్ ప్రకారమే రిజల్ట్ వచ్చేలా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. అభ్యర్థులెవరూ ఆందోళన చెందవద్దని ఆయన భరోసా ఇచ్చారు. నిరుద్యోగులకు టీజీపీఎస్సీపై నమ్మకం కలిగేలా పనిచేస్తున్నామని బుర్రా వెంకటేశం చెప్పారు. ఫలితాల ఆలస్యానికి ఆస్కారమే లేదన్నారు. మార్చి 31 లోపల ఖాళీల జాబితా ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అదే జరిగితే ఏప్రిల్‌లో భర్తీపై కసరత్తు చేసి, మే నుంచి నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు.
పరీక్షలతో సంబంధం లేనివారు ఒక్కోసారి అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఘాటుగా విమర్శించిన బుర్రా వెంకటేశం, ఇకపై ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పేపర్ లీకేజీ సమస్యను అధిగమించేందుకు కొత్త విధానాలను అవలంబించే యోచనలో ఉన్నట్టు వివరించారు. భవిష్యత్తులో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించి, మరుసటిరోజే కీ విడుదల చేసేందుకు కృషి చేస్తామన్నారు.
గ్రూప్-3 అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక అప్‌డేట్ - పరీక్షల షెడ్యూల్ విడుదల
HighCourt on Group 3 and 4 Exams : గ్రూప్ 3, 4 పరీక్షలపై స్టేకు హైకోర్టు నిరాకరణ