Sankranti Holydays For Intermediate Students : తెలంగాణ ఇంటర్ బోర్డు సంక్రాంతి పండుగ సందర్భంగా సెలవులను ప్రకటించింది. జనవరి 13వ తేదీ నుంచి 16 వరకు ఇంటర్ కళాశాలలకు సెలవులు మంజూరు చేస్తూ ఓ ప్రకటన తెలిపింది. 17న శుక్రవారం తిరిగి కళాశాలలు ప్రారంభమవుతాయని విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. సంక్రాంతి సెలవుల్లో విద్యార్థులకు కాలేజీలు ఎలాంటి క్లాసులు నిర్వహించకూడదని హెచ్చరించింది. అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. 11వ తేదిన (రెండో శనివారం), 12న (ఆదివారం) కావడంతో మొత్తంగా విద్యార్థులకు పెద్ద మొత్తంలో ఆరు రోజుల పాటు సెలవులు లభించాయి.
స్కూళ్లకు సంక్రాంతి సెలవులు : పాఠశాలలకు ఈసారి 2 రోజులు సెలవులు అదనంగా వచ్చాయి. వారికి జనవరి 11 నుంచి జనవరి 17వ తేదీ వరకు వారం రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పాఠశాలలు తిరిగి జనవరి 18న అంటే శనివారం తెరుచుకోనున్నాయి. సెలవులపై క్లారిటీ రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను సొంతూళ్లకు తీసుకెళ్లడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. సంక్రాంతి పండక్కి సొంతూరికి వెళ్లి స్నేహితులు, బంధువులతో కలిసి ఆనందంగా గడపేందుకు సిద్ధం అవుతున్నారు.
వారం రోజుల క్రితం క్రిస్మస్, బాక్సింగ్ డే, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో డిసెంబరు నెల 25, 26, 27 ఇలా వరుసగా సెలవులు వచ్చాయి. ఆ తర్వాత జనవరి 1వ తేదీన ప్రభుత్వం పబ్లిక్ హాలిడే ప్రకటించింది.