How to Make Chicken Cutlets at Home: హోటల్, కెఫెలో దొరికే చికెన్ కట్లెట్ చూస్తే మనలో చాలా మందికి నోరూరుతుంది. కానీ అక్కడ వాడేసిన నూనె, పరిస్థితులు చూసి వెనకడుగు వేస్తుంటారు. పోనీ ఇంట్లో చేసుకుందాం అంటే అన్నీ దొరకవని ఆలోచిస్తుంటారు. ఇకపై అలాంటి అవసరం లేకుండా ఇంట్లో లభించే పదార్థాలు, దేశీయ మసాలాలతో ఈజీగా చేసుకోవచ్చని అంటున్నారు. ఇంకా ఈ కట్లెట్ను తిన్నా కొద్ది తినాలనిపిస్తుంటుంది. వీటిని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే సుమారు నెల రోజుల పాటు ఎప్పుడైనా చేసుకోని తినవచ్చని చెబుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఇందులోకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు
- 200 గ్రాముల బోన్‌లెస్ చికెన్
- 2 టేబుల్ స్పూన్ల నూనె
- ఒక టేబుల్ స్పూన్ వెల్లులి తరుగు
- ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తరుగు
- 3 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ తరుగు
- ఒక టీ స్పూన్ మిరియాల పొడి
- ఒక టీ స్పూన్ కారం
- రుచికి సరిపడా ఉప్పు
- పావు టీ స్పూన్ పసుపు
- ఒక టీ స్పూన్ గరం మసాలా
- ఒక కప్పు ఉడికించిన ఆలూ తురుము
- కొత్తిమీర తరుగు
- ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్
- ఒకటిన్నర టేబుల్ స్పూన్ల మైదా పిండి
- ఒక కప్పు బ్రెడ్ పొడి
కట్లెట్స్ పైన కోటింగ్ కోసం
- 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి
- 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్
- 3 టేబుల్ స్పూన్ల గిలకొట్టిన గుడ్డు
- చిటికెడు ఉప్పు
- పావు కప్పు నీరు
- ఒక కప్పు బ్రెడ్ క్రంబ్స్
తయారీ విధానం
- ఇందుకోసం ముందుగా బోన్‌లెస్ చికెన్‌ను మిక్సీలో వేసి కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత స్టౌ ఆన్ చేసి కడాయిలో నూనె పోసి వేడి చేసి వెల్లులి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు వేసి వేపుకోవాలి.
- అనంతరం ఇందులోనే చికెన్ మిశ్రమం వేసి హై ఫ్లేమ్ మీద గడ్డలు కట్టకుండా కలుపుతూ వేయించుకోవాలి.
- చికెన్ వేగుతున్నప్పుడే మిరియాల పొడి, పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు వేసి కాస్త తేమ ఉండేలా వేయించుకోని పక్కకుపెట్టుకోవాలి.
- ఇందులోనే అలుగడ్డ తరుగు, మైదా, కార్న్ ప్లోర్, కొత్తిమీర తరుగు, బ్రెడ్ క్రంబ్స్ వేసి చికెన్‌ను గట్టిగా పిండుతూ కలపాలి.
- ఆ తరువాత ఈ మిశ్రమాన్ని కట్లెట్స్ మాదిరి చేసుకోవాలి. (మీ ఇష్టమైన ఆకారంలో చేసుకోవచ్చు)
- మరోవైపు కట్లెట్స్ పైన కోటింగ్ కోసం ఇంకో గిన్నెను తీసుకుని అందులో మైదా, కార్న్ ఫ్లోర్, గుడ్డు, ఉప్పు, నీరు పోసి గడ్డలు లేకుండా పిండిని బాగా కలపాలి.
- ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న కట్లెట్స్ను తీసుకుని పిండిలో ముంచి.. ఆ తర్వాత బ్రెడ్ పొడిలో వేసి అన్ని వైపులా బాగా పట్టించాలి.
- స్టౌ ఆన్ చేసి కడాయిలో నూనె వేడిచేసుకుని కట్లెట్ను వేసి మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా వేపుకుంటే సరిపోతుంది.
- ఈ వేడి వేడి చికెన్ కట్లెట్ను మయోనిజ్, టమాటా కెచప్‌తో సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది.
కరకరలాడే క్యాబేజీ పకోడి- ఇలా చేస్తే ఇంట్లోనే క్యాటరింగ్ టేస్ట్ పక్కా!
మాంసం ఉడకట్లేదా? కూరల్లో కారం, స్వీట్స్‌లో తీపి ఎక్కువైందా? - ఈ టిప్స్ పాటిస్తే ఆల్‌సెట్!