తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

భోగిపళ్లుగా మారే రేగిపళ్లు- ఆ రోజే పిల్లల తలపై ఎందుకు పోస్తారో తెలుసా? - BHOGI FESTIVAL 2025

భోగి రోజు సాయంత్రం చిన్నారులకు భోగి పళ్లు పోయడం మంచి సంప్రదాయం- ఎలా చేసుకోవాలో మీ కోసం!

Bhogi Pallu Significance
Bhogi Pallu Significance (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 13, 2025, 4:11 AM IST

Bhogi Pallu Significance :తెలుగువారి పండుగల్లో పెద్ద పండుగ సంక్రాంతి. ఆ ముందు రోజు భోగి పండుగ జరుపుకుంటాం. తెలుగు లోగిళ్లలో భోగి రోజు సాయంత్రం చిన్నారులకు భోగి పళ్లు పోయడం సంప్రదాయం. అయితే ఈ భోగి పళ్లు చిన్నారులకు ఎందుకు పోస్తారు? దీని వెనుక ఉన్న కారణం ఏమిటి అనే ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

భోగిపళ్లుగా మారే రేగుపళ్లు
తెలుగు వారి జీవితాలలో సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో, దాని ముందు రోజున వచ్చే భోగికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. భోగి అనగానే పిల్లలకు పేరంటం చేసి వారి మీద పోసే రేగుపళ్లే గుర్తుకువస్తాయి. ఆ రోజున రేగుపళ్లు కాస్తా భోగిపళ్లుగా మారిపోతాయి.

రేగు పళ్లంటే
రేగు భారతదేశంలోనే పురుడు పోసుకుందని ఓ నమ్మకం. అందుకు అనుగుణంగానే దీన్ని 'ఇండియన్‌ డేట్‌' అనీ 'ఇండియన్‌ జుజుబీ' అని పిలుస్తారు. అందుకు తగినట్లుగానే మన పురాణాలలోనూ దీని ప్రస్తావన కనిపిస్తుంది. సంస్కృతంలో రేగు పళ్లను 'బదరి పళ్లు' అని పిలుస్తారు. సాక్షాత్తూ ఆ నరనారాయణులు ఈ బదరీ వృక్షం వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని, ఆ ఫలాలని తింటూ తమ తపస్సుని కొనసాగించారనీ ప్రతీతి. అందుకే ఆ ప్రదేశానికి బదరీక్షేత్రం అన్న పేరు వచ్చిందని చెబుతారు.

సంక్రాంతికి అందివచ్చే రేగుపళ్లు
దక్షిణ భారతదేశంలో సంక్రాంతి నాటికి ఈ రేగుపళ్లు అందుబాటులోకి వస్తాయి. పుల్లపుల్లగా ఉండే ఈ రేగు పళ్లు తినడానికి రుచిగా ఉండటమే కాదు, సకల ఆరోగ్యాలనూ అందించే ఔషధి గుణాలతో నిండి ఉంటాయి.

రేగుపళ్ల ఆరోగ్య ప్రయోజనాలు
జలుబు దగ్గర నుంచి సంతానలేమి వరకూ రేగుని అన్ని రకాల రుగ్మతలకీ దివ్యౌషధంగా భావిస్తారు. రేగుపళ్లు ఉన్నచోట క్రిమికీటకాలు దరిచేరవని ఒక నమ్మకం. ఈ పండ్ల నుంచి వచ్చే వాసన మనసు మీద ఆహ్లాదకరమైన ప్రభావం చూపిస్తుంది. భూటాన్‌లో అయితే కేవలం ఇంటిని సువాసనభరితంగా ఉంచేందుకు ఈ పళ్లను మరిగిస్తారు.

పిల్లలకు భోగిపళ్లు ఎందుకు పోస్తారు
భోగి రోజు సాయంత్రం ఐదేళ్లలోపు పిల్లలకి భోగిపళ్లు పోస్తారు. ఈ వయసులో ఉన్న పిల్లల్లో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. పైగా ఊపిరితిత్తులూ, జీర్ణ వ్యవస్థ చాలా బలహీనంగా ఉంటాయి. రేగుపళ్లు నిజంగా వీరి పాలిట అమృతంలా పనిచేస్తాయి. ఎందుకంటే రేగుపళ్లలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉండి రోగనిరోధకశక్తిని పెంచుతుంది. పైగా జీర్ణ సంబంధమైన వ్యాధులను నివారించేందుకు, ఉదర సంబంధ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించేందుకు రేగుపళ్లు ఉపయోగపడతాయి.

భోగిపళ్లు ఎలా పోస్తారు
భోగి రోజు సాయంత్రం చుట్టుపక్కల వారిని పేరంటానికి పిలిచి వారిచే పిల్లలకు భోగిపళ్లు పోయిస్తారు. గుప్పిట నిండా రేగుపళ్లు, చిల్లర డబ్బులు, బంతిపూల రెక్కలు, చెరుకు ముక్కలని తీసుకుని, మూడుసార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి తల మీదుగా దిష్టి తీసి వారిపై పోస్తారు. ఇలా పోయడం వల్ల చిన్నారులకు దృష్టి దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. అయితే దిష్టి తీసిన రేగు పళ్లుపిల్లలు తినకుండా జాగ్రత్త పడాలి. భోగిపళ్ల సంస్కృతి ఇంత గొప్పదని తెలిసిన తర్వాత తెలుగువారు దాన్ని ఆచరించకుండా ఎలా ఉంటారు? మీ ఇంట్లోని చిన్నారులకు కూడా ఈ భోగినాటి సాయంత్రం భోగిపళ్లు పోయండి. వారికి ఉండే దృష్టి దోషాలు తొలగించుకోండి.

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details