Som Pradosh Vrat Katha : ఏ వ్రతమైనా, నోములైనా, పూజలైనా, ఆ వ్రత ఫలం సంపూర్ణంగా దక్కాలంటే శ్రద్ధ భక్తి అవసరం. ముఖ్యంగా నోములు, వ్రతాలు ఆచరించే టప్పుడు ఆ వ్రత కథలను చదువుకొని శిరస్సున అక్షింతలు వేసుకుంటేనే వ్రతం సంపూర్ణం అయినట్లుగా అర్థం. సోమ ప్రదోష వ్రత విధానం వివరంగా తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు వ్రత కథను కూడా తెలుసుకుందాం.
సోమ ప్రదోష వ్రత కథ
శివ మహా పురాణంలో, స్త్రీల నోములు, వ్రతాలు కథల పుస్తకాలలో ప్రదోష వ్రత కథ ఉంటుంది. పూర్వం ఒక నగరంలో బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమెకి భర్త చనిపోవడం వల్ల తన స్వశక్తితో కష్టపడి కొడుకులను పోషించుకుంటూ జీవనం సాగించేది. ఒకరోజు బయటకి వెళ్ళి తిరిగి వస్తుండగా ఆ బ్రాహ్మణ స్త్రీకి గాయపడిన స్థితిలో ఉన్న ఒక యువకుడు కనిపిస్తాడు. ఆమె దయతో అతనిని ఇంటికి తీసుకొచ్చి సపర్యలు చేసింది. తర్వాత ఆ కుర్రాడు విదర్భ రాకుమారుడని తెలుసుకుంటుంది. శత్రు సైనికులు అతని రాజ్యం మీద దాడి చేసి, ఆ యువకుని తండ్రిని బందీగా చేసుకుని రాజ్యాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారని తెలుస్తుంది. రాకుమారుడు బ్రాహ్మణ స్త్రీ కుమారులతో కలిసి అక్కడే నివసిస్తూ ఉన్నాడు. ఒకరోజు అన్షుమతి అనే గంధర్వ కుమారి యువరాజుని చూసి ముగ్ధురాలు అవుతుంది. మరుసటి రోజు అన్షుమతి తన తల్లిదండ్రులతో కలిసి యువరాజుని కలుస్తుంది. కొన్ని రోజులకు శివుడు అన్షుమతి తల్లిదండ్రులకు కలలో కనిపించి వారి పెళ్లి చేయాలని ఆదేశిస్తాడు.
ప్రదోష వ్రత ప్రభావం
బ్రాహ్మణ స్త్రీ శివుడి పరమ భక్తురాలు. ప్రదోష వ్రతం తప్పనిసరిగా పాటిస్తూ వచ్చేది. ఆమె ప్రదోష వ్రత ఫలితం వల్ల అన్షుమతి తండ్రి అయిన గంధర్వ రాజు తన సైన్యంతో కలిసి యువరాజు రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న విదర్భ మీద దాడి చేసి విజయం సాధిస్తాడు. శత్రువులని తరిమేసి యువరాజు తండ్రిని కూడా బంధీల నుంచి విముక్తుడిని చేస్తాడు. అందుకే ప్రదోష వ్రతం నాడు ఉపవాసం ఉండి శివుడిని ఆరాధిస్తే భక్తుల కోరికలు తప్పకుండా నెరవేరతాయని నమ్ముతారు. యువరాజు ఆ బ్రాహ్మణ స్త్రీ ఆశ్రయాన్ని పొందిన తర్వాతనే తన కష్టాల నుంచి విముక్తి పొందడంతో పాటు తన తండ్రిని కూడా శత్రు రాజుల నుంచి విడిపిస్తాడు. అందుకే ప్రదోష వ్రతానికి అంతటి ప్రాముఖ్యత ఉంది.భక్తిశ్రద్ధలతో సోమ ప్రదోష వ్రతాన్ని ఆచరించిన తరువాత వ్రత కథను కూడా చదువుకుంటే సోమ ప్రదోష వ్రత ఫలం సంపూర్ణంగా దక్కుతుంది. ఓం నమః శివాయ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం