History of Umerkot Shiva Lingam in Pakistan: పరమేశ్వరుడు, ప్రళయకాల రుద్రుడు, శివయ్య, భోళా శంకరుడు, అర్ధనారీశ్వరుడు ఇలా కోరిన వెంటనే వరాలిచ్చే ఆ ముక్కింటికి ఎన్నో పేర్లు. ఏ పేరుతో పిలిచినా పలికే దైవం. మనసావాచా తనను స్మరిస్తే, శరణువేడింది రాక్షసుడైనా సరే వరాలిచ్చేస్తాడు. అందుకే శివాలయాలు నిత్యం శివ నామ స్మరణతో స్మరణతో మార్మోమోగుతాయి. ఇక చాలా దేవాలయాల్లో శివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. అయితే కొన్ని ఆలయాల్లో శివలింగం ఇప్పటికీ పెరుగుతూ ఉంటుంది. అందులో ఇప్పుడు చెప్పబోయే దేవాలయం కూడా ఒకటి. మరి ఆ ఆలయం ఏంటి? ఎక్కడ ఉంది అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇప్పటికీ పెరుగుతూనే ఉండే శివలింగం పాకిస్థాన్‌లోని సింధ్ రాష్ట్రం ఉమర్‌కోట్‌లో ఉంది. ఇక్కడి శివమందిరం నిత్యం శంభోశంకర స్మరణతో మార్మోగుతుంటుంది. దేశ విభజనకు ముందు అవిభక్త భారత్‌లోని సింధ్‌రాష్ట్రంతో పాటు ప్రస్తుతం పాక్‌గా పేర్కొంటున్న ప్రాంతంలో లక్షలాదిమంది హిందువులు ఉండేవారు. దేశ విభజన అనంతరం ఎక్కువ శాతం మంది హిందువులు భారత్‌కు వచ్చేశారు. అయితే కొందరు మాత్రం అక్కడే ఉంటూ పాక్ సమాజంలో భాగమయ్యారు. ఇప్పటికీ పాక్‌లో వేలాది హిందూ ఆలయాలు, గురుద్వారాలు ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే భక్తులతో అలరారుతుండగా, వేలాది కట్టడాలు కనీస సంరక్షణ లేక శిథిలావస్థకు చేరుకున్నాయి. సింధ్‌లోని ఉమర్‌కోట్‌గా పిలిచే ఈ ప్రాంతాన్ని మొదట్లో అమర్‌కోట్ అనేవారు. ముస్లిం పాలకుల కాలంలో ఉమర్‌కోట్‌గా మారింది.
రోజు రోజుకూ పెరుగుతున్న శివలింగం: ఆలయ పురాణాల ప్రకారం ఇక్కడ పెద్ద పెద్ద పచ్చిక బయళ్లు ఉండేవి. పశువులు కాసే కొందరు తమ పశువులను మేతకు ఇక్కడకు తీసుకువచ్చేవారు. అందులో కొన్ని ఆవులు ఒక ప్రాంతానికి వెళ్లి పాలిస్తుండేవి. ఆవులు ఎక్కడికి వెళ్లి పాలు ఇస్తున్నాయన్నా ఆసక్తితో ఆవుల కాపరి ఒకరు అక్కడకు వెళ్లి పరిశీలించగా అది శివలింగమని తేలింది. దీంతో స్థానికులకు తెలపగా వారు ఆ లింగానికి పూజలు ప్రారంభించారు. అలా భక్తులతో పూజలు అందుకుంటున్న శివలింగం ఇప్పటికీ పెరుగుతుండటం విశేషం. మొదట్లో శివలింగం ఎలా ఉండేదో ఒక వలయాన్ని గీయగా, ఇప్పుడు ఆ వలయాన్ని దాటి లింగం ఉండటాన్ని గమనించవచ్చు.
శివరాత్రికి భక్త సందోహం: పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినాన ఈ క్షేత్రానికి లక్షలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. ఆ సమయంలో శంభో శంకర నామస్మరణతో ప్రతిధ్వనిస్తుంది. ఆలయ ప్రాంగణం చాలా పెద్దది. దీంతో పర్వదినం వేళ భక్తులకు తగినట్టుగా సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు.
ఉమర్‌కోట్‌లో హిందువులే మెజార్టీ: పాకిస్థాన్‌లోని ఏ నగరానికి లేని విశిష్టత ఉమర్‌కోట్‌కు ఉంది. ఈ నగర జనాభాలో దాదాపు 80 శాతం వరకు హిందువులే కావడం గమనార్హం. మతపరమైన వైషమ్యాలు లేవని స్థానికులు చెబుతుంటారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు శివమందిరం ప్రధాన కేంద్రంగా ఉండటం విశేషం.
గుండె ధైర్యం ఉన్నవారికే ప్రవేశం - ఈ శివాలయం ప్రత్యేకత తెలుసా?
ఏటా పెరిగే గణపతి - చెవిలో కోరికలు చెబితే చాలు - అనుకున్నది జరగడం ఖాయం!