Pawan Kalyan Election Campaign 2024 :సార్వత్రిక ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ ఏపీలోని పిఠాపురం నుంచే సమర శంఖం పూరించనున్నారు. మార్చి 30వ తేదీ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వెళ్తానని, అందుకు అనుగుణంగానే పర్యటన షెడ్యూల్స్ రూపొందించాలని నేతలకు స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం పార్టీ ముఖ్య నేతలతో పవన్ సమావేశమయ్యారు.
మూడు విడతలుగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ప్రతి విడతలోజనసేనపోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్లేలా షెడ్యూల్ ఉండాలని నాయకులకు స్పష్టం చేశారు. పిఠాపురం వెళ్లిన తొలి రోజు శక్తిపీఠమైన శ్రీ పురూహూతిక (Puruhutika Shaktipeeth) అమ్మవారిని పవన్ దర్శనం చేసుకుంటారు. అక్కడ వారాహి వాహనానికి పూజలు నిర్వహిస్తారు. అనంతరం దత్తపీఠాన్ని దర్శిస్తారు. మూడు రోజులపాటు పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ నాయకులతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తారు.
18 అసెంబ్లీ, ఒక లోక్సభ అభ్యర్థులను ప్రకటించిన జనసేన
క్రియాశీల కార్యకర్తలతో సమావేశాలు :క్రియాశీల కార్యకర్తలతో మండలాల వారీగా సమావేశాలు ఉంటాయనిపవన్ కల్యాణ్రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. కూటమి భాగస్వాములైన తెలుగుదేశం, బీజేపీ నాయకులతో భేటీలకు కానున్నారు. పిఠాపురం నుంచే రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలకు వెళ్లాలని పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకోవడంతో అందుకు తగ్గ ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ క్రమంలోనే పిఠాపురం నియోజకవర్గంలోని బంగారు పాప దర్గా సందర్శన, క్రైస్తవ పెద్దలతో సమావేశంతో పాటు సర్వమత ప్రార్థనల్లో పవన్ పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఉగాది వేడుకలను సైతం పిఠాపురంలోనే పవన్ నిర్వహించుకోబోతున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.