High Tension At Telangana Bjp Office : హైదరాబాద్‌లోని నాంపల్లిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ నేత, ఎంపీ ప్రియాంక గాంధీపై దిల్లీకి చెందిన బీజేపీ నేత రమేశ్ బిదూరీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ నేతృత్వంలో పెద్ద సంఖ్యలో బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు చేసిన యత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
గాంధీ భవన్ నుంచి ర్యాలీగా బీజేపీ కార్యాలయం వరకు వెళ్లి ముట్టడించాలని యువజన కాంగ్రెస్ భావించింది. దీంతో పోలీసులు పెద్ద సంఖ్యలో గాంధీ భవన్ వద్ద మెహరించారు. గాంధీ భవన్ వద్దకు వస్తే బయటకు పోనీకుండా పోలీసులు అడ్డుకుంటారని భావించి కొందరు యువజన కాంగ్రెస్ నాయకులు నేరుగా నాంపల్లిలోని బీజేపీ కార్యాలయ ముట్టడికి వచ్చారు. అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు ఎదురు దాడి చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంపైకి రాళ్లు విసిరారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. కార్యాలయంపై రాళ్లు విసరడంతో ఒక బీజేపీ కార్యకర్త తలకు గాయమైంది. బీజేపీ శ్రేణులు కర్రలతో కాంగ్రెస్ కార్యకర్తల వెంటపడ్డారు.పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. ప్రియాంక గాంధీపై రమేష్ బిదూరి చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు.
తప్పుడు వ్యాఖ్యలు ఎవరు చేసినా ఖండించాల్సిందే : బీజేపీ రాష్ట్ర ఆఫీస్‌పై కాంగ్రెస్ దాడిని కేంద్రమంత్రి బండి సంజయ్ ఖండించారు. ఈ సందర్భంగా ట్విటర్ (X) వేదికగా స్పందించారు. బీజేపీ తలుచుకుంటే గాంధీభవన్ పునాదులు కూడా మిగలవని హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని, రాళ్ల దాడులను కాంగ్రెస్ ప్రోత్సహించాలనుకుంటోందా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తల సహనాన్ని చేతగానితనంగా భావించొద్దని, తప్పుడు వ్యాఖ్యలు ఎవరు చేసినా ఖండించాల్సిందేనని అన్నారు. తప్పుడు వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకోవాల్సిందేనని వెల్లడించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలంటే ఊరుకునేది లేదని వ్యాఖ్యనించారు. తక్షణమే దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రొటోకాల్ ఉల్లంఘనపై బీజేపీ నిరసన - శాసనసభలో కాంగ్రెస్ నేతలతో వాగ్వాదం