KTR Press Meet at Telangana Bhavan : కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని కాంగ్రెస్ అంటోందని.. ఈ క్రమంలోనే రైతుబంధును తీసేస్తున్నారని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. రైతు బంధు పంపిణీలో రూ.22 వేల కోట్ల అవినీతి జరిగిందని అంటున్నారు.. మరి ఆ డబ్బులు ఎక్కడికి పోయాయో చెప్పాలని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ.26,500 కోట్లు ఎగ్గొట్టిందని కేటీఆర్ ఆరోపించారు. రైతుబంధు పంపిణీలో అవినీతి జరిగితే విచారణ జరిపించండని డిమాండ్ చేశారు. ఎవరికి అక్రమంగా రైతుబంధు నిధులు ఇచ్చామో లెక్కలు తీయండని ప్రభుత్వానికి సవాల్ చేశారు. రైతుబంధుపై రైతులను అప్రమత్తం చేయాలని కార్యకర్తలను కోరుతున్నానని పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి రైతుకు రైతుభరోసా ఇప్పించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. రైతులు మళ్లీ కొత్తగా ఎందుకు ప్రమాణ పత్రాలు ఇవ్వాలని కేటీఆర్ ప్రశ్నించారు. కేబినెట్ సబ్‌కమిటీ ఐదేళ్లు పోయాక నివేదిక ఇస్తుందని మాకు సమాచారం అందిందని ఎద్దేవా చేశారు. కౌలు రైతులకు ఎప్పటినుంచి రైతు భరోసా ఇస్తారని మరోసారి ప్రశ్నించారు.
"కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయి కూడా రైతుబంధు ఇవ్వలేదు. రైతును రాజును చేస్తామని ఎన్నికల ముందు చెప్పారు. రైతు డిక్లరేషన్ పేరుతో చాలా హామీలు ఇచ్చారు. 1.6 కోట్ల మంది ప్రజాపాలన దరఖాస్తులు చేసుకున్నారు. రైతులు ప్రమాణ పత్రాలు ఇవ్వాలని ఇప్పుడు అడుగుతున్నారు. రైతు శాసించాలని కేసీఆర్ అన్నారు.. రైతులు యాచించాలని కాంగ్రెస్ అంటుంది. వానాకాలంలో ఎగ్గొట్టిన రైతుబంధు కూడా ఇవ్వాల్సిందే. రైతు రుణమాఫీ చేశామని చెప్తున్నారు. గ్రామాల వారిగా రుణమాఫీ లిస్ట్ తెచ్చి పెట్టాలి. రైతుభరోసా ఎవరికి ఇస్తారో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి. రైతుబంధును బొందపెట్టాలని ప్రభుత్వం చూస్తోంది." - కేటీఆర్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేబినెట్ నిర్ణయం తర్వాత బీఆర్‌ఎస్ కార్యాచరణ ప్రకటన : రేపటి కేబినెట్‌లో ప్రభుత్వం అన్ని ఆలోచించి అందరి రైతుల పక్షాన నిర్ణయం తీసుకోవాలని కేటీఆర్ చెప్పారు. రైతులను భయపెట్టే కుట్రను అడ్డుకుంటామన్నారు. చిత్తశుద్ధి ఉంటే రైతుబంధు ఎక్కడ దుర్వినియోగం అయిందో ప్రభుత్వం వివరాలు బయటపెట్టాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్, బీజేపీ ఒకే లైన్‌లో ఉంటే చేసేదేమీ లేదని అన్నారు. కేబినెట్ నిర్ణయం తర్వాత బీఆర్‌ఎస్ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ప్రమాణ పత్రాలు, దరఖాస్తులు వరంగల్ డిక్లరేషన్‌లో పెట్టారా అంటూ ప్రశ్నించారు. చేత కాకపోతే రైతుల కాళ్లు పట్టుకొని క్షమాపణ అడగాలని కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
“జంగ్ సైరన్” ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టించింది : కేటీఆర్
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నాను : కేటీఆర్